కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్ రైతు వ్యతిరేక, పేదల వ్యతిరేక బడ్జెట్ అని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం బడ్జెట్ ప్రవేశ పెట్టారు. దీనిపై హరీష్ స్పందించారు. ఉపాధి హామీ పథకానికి, పేదల ఆహార భద్రత కార్యక్రమానికి బడ్జెట్లో దాదాపు 30 శాతం కోత విధించారన్నారు. ఎరువుల సబ్సిడీని తగ్గించి రైతులపై అదనపు భారం మోపుతున్నారని ద్వజమెత్తారు. తెలంగాణకు మొండిచేయి చూపారన్నారు. తమ రాష్ట్రంపై ఎప్పటి మాదిరి నిర్లక్ష్యం చూపారని వ్యాఖ్యానించారు. కార్పొరేట్లకు మాత్రం అనుకూలంగా బడ్జెట్ను రూపొందించారన్నారు. బీజేపీ హయాంలో ఇప్పటికే రికార్డుస్థాయి అప్పులు చేశారని, ఈ ఏడాది దేశాన్ని మరింత అప్పుల ఊబిలోకి నెట్టాలని చూడడం దురదృష్టకరం అన్నారు.
విద్య, వైద్యం వంటి కీలక రంగాలకు కేంద్రం పూర్తిగా విస్మరించిందన్నారు. విభజన హామీల ప్రస్తావన లేదని వాపోయారు. రాష్ట్రానికి ప్రోత్సాహకాలు అడిగితే ఇవ్వలేదన్నారు. ఏ ఒక్క రంగానికి కూడా సంపూర్ణ న్యాయం చేయలేదన్నారు. ఇదో భ్రమల బడ్జెట్ అని విమర్శించారు. అందమైన మాటలు తప్ప బడ్జెట్ అంతా డొల్ల అన్నారు. ఏడు ప్రాధాన్యతా రంగాలను గాలికి వదిలేశారన్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసు లేదని మండిపడ్డారు. నేతన్నలకు జీఎస్టీ రాయితీ, ప్రోత్సాహకాలు ఎక్కడ అని ప్రశ్నించారు. పీఎం కిసాన్ లబ్ధిదారుల సంఖ్యను కుదించడం ఏమిటన్నారు.