దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భూమి కంపించింది. ఇటీవల.. నెపాల్ లో భూకంపం సంభవించిన సమయంలో… ఆ ప్రభావం ఢిల్లీలోనూ చూపించింది. కాగా… తాజాగా ఢిల్లీలో మరోసారి స్వల్ప భూకంపం సంభవించింది. శనివారం రాత్రి ఢిల్లీతోపాటు సమీప ప్రాంతాల్లో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.4గా నమోదైంది. నాలుగు రోజుల వ్యవధిలో ఢిల్లీ లో రెండోసారి భూకంపం చోటుచేసుకోవడంతో ప్రజలు భయబ్రాంతులకు గురి అవుతున్నారు.
శనివారం రాత్రి 7.57 గంటల సమయంలో నేపాల్ సమీపంలో భూకంపం సంభవించింది. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.4 నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది.
భూమి లోపల 10 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం ఉందని తెలిపింది. ఈ నెల 9న కూడా ఢిల్లీలో స్వల్ప భూకంపం సంభవించింది. ఢిల్లీతోపాటు నోయిడా, గుర్గావ్ వంటి ప్రాంతాల్లో 6.3 తీవ్రతతో భూమి కంపించింది. నేపాల్‌లో ఓ భవనం కూలి ఆరుగురు మరణించారు. తాజాగా మరోసారి భూమి కంపించింది. ఈ వరుస భూకంపాలతో ప్రజలు బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారు.