దగ్గు మందు తాగి దాదాపు 66మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. గాంబియా దేశంలో ఈ చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. అయితే…. ఆ దగ్గుమందు భారత్ లో తయారు కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
దీంతో రంగంలో దిగిన ప్రపంచ ఆరోగ్యసంస్థ విచారణకు ఆదేశించింది. మైడెన్ ఫార్మాసుటికల్ కంపెనీతో పాటు భారతదేశంలోని రెగ్యులేటరీ అథారిటీల పనితీరును విచారించనున్నారు.
ఓరల్ సొల్యూషన్స్, కోఫెక్స్ మాలిన్ బేబీ సిరప్, మేకోఫ్ బేబీ కఫ్ సిరప్, మాగ్రిప్ కోల్డ్ సిరప్ అనే ఈ నాలుగు కంపెనీలు గాంబియాలో 66 మంది చిన్నారుల మరణానికి కారణమైనట్లు తెలుస్తోంది. ఈ దగ్గు మందులను తయారు చేసే మైడెన్ ఫార్మాసుటికల్స్ హర్యానాలో ఉంది.
ప్రస్తుతం వరకు అందుబాటులో ఉన్న సమచారం ప్రకారం.. ఆ సంస్థ ఈ ఉత్పత్తులను గాంబియాకు మాత్రమే ఎగుమతి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఆరోపణలపై కంపెనీ ఇంకా స్పందించలేదని ‘ఎన్డీటీవీ‘ నివేదించింది. కాగా.. ఈ మందుల వినియోగం వల్ల గాంబియాలో పెద్ద ఎత్తున పిల్లలు చనిపోయారని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.
ఈ దగ్గు మందులో ఉన్న డైథిలిన్ గ్లైకాల్, ఇథిలిన్ గ్లైకాల్ మానవులకు విషం లాంటివని డబ్ల్యూహెచ్ఓ బుధవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఈ ఘటనపై డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ మాట్లాడుతూ.. పిల్లల మరణాలు నాలుగు డ్రగ్స్‌కు సంబంధించినవని తెలిపారు.
ఈ సిరప్లు తీసుకోవడం వల్ల పిల్లల కిడ్నీలు దెబ్బతిన్నాయని చెప్పారు. ప్రోమెథాజైన్ ఓరల్ సొల్యూషన్, కోఫెక్స్మలిన్ బేబీ కఫ్ సిరప్, మాకోఫ్ బేబీ కఫ్ సిరప్, మాగ్రిప్ ఎన్ కోల్డ్ సిరప్ అనే నాలుగు ఉత్పత్తుల ఈ మరణాలకు కారణం అని డబ్ల్యూహెచ్ వో తెలిపింది.