ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ తాను చేసిన పొరపాటుకు గాను రైల్వే శాఖకు క్షమాపణలు చెప్పారు. నటుడిగా ఆయనకు మంచి పేరు ఉంది. ఆ తర్వాత కరోనా సమయంలో వేలాదిమందికి సాయం చేసి రియల్ హీరోగా నిలిచారు. అలాంటి సోనూసూద్ రైలు ప్రయాణంలో డోర్ వద్ద కూర్చొని, బయటకు చూస్తున్నారు. ఈ వీడియో ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. పది మందికి ఆదర్శంగా నిలవాల్సిన ఈ రియల్ హీరో ఇలా చేయడాన్ని పలువురు తప్పుబట్టారు. చాలామంది ఇది రైల్వే నిబంధనలకు విరుద్ధమంటూ ఖండించారు. ముంబై రైల్వే పోలీస్ కమిషనరేట్ కూడా దీనిని తప్పుబట్టింది. సోనూ సూద్ ఫుట్ బోర్డు వద్ద ప్రయాణం చేసి ఎంటర్టైన్ చేయడం సినిమాల్లో ఉండవచ్చు, కానీ నిజ జీవితంలో వద్దు అని పేర్కొంది.
ఈ అంశంపై నార్తర్న్ రైల్వే కూడా స్పందించింది. సోనూ సూద్… ఈ దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా చాలామంది మిమ్మల్ని అభిమానిస్తారని, వారికి మీరు రోల్ మోడల్ అని, రైలు డోర్ వద్ద కూర్చొని, ప్రయాణించడం ప్రమాదకరమని, ఇలాంటి వీడియో మీ అభిమానులకు తప్పుడు సంకేతాలు పంపిస్తుందని, ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని కోరింది. నిజ జీవితంలో ఇలాంటి స్టంట్స్ సరికాదని పేర్కొంది. ఈ వీడియోను సోనూ సూద్ డిసెంబర్ 13వ తేదీన పోస్ట్ చేశారు.
ఈ నేపథ్యంలో సోనూసూద్ క్షమాపణలు చెప్పారు. అయితే టిక్కెట్ కొనుగోలు చేయలేక ప్రతిరోజు రైలు డోర్ల వద్ద ప్రయాణించే లక్షలాది మంది ప్రజలు తమ జీవితాన్ని ఎలా అనుభవిస్తున్నారో ఎక్స్పీరియన్స్ కోసం తాను అలా చేశానని చెప్పారు.