Tollgate: ప్రతి నెల గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు వస్తుంటాయి. అయితే టోల్ ఛార్జీలు ఏడాదికొకసారి పెరుగుతాయి. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న టోల్ ప్లాజాల వద్ద వాహనాల రాకపోకల టోల్ ఛార్జీలు పెరిగాయి. అవి ఈ రోజు అర్థరాత్రి నుంచే అమలు అవుతాయి. హైదరాబాద్-విజయవాడ మధ్యలో ఉన్న పంతంగి, చిల్లకల్లు, కొర్లపహాడ్ టోల్ ఛార్జీలు పెరిగాయి. కార్లు, వ్యాన్లు, జీపులకు వన్ వే ప్ర్రయాణానికి రూ.5, టూ వే ప్రయాణానికి రూ.10, ఇతర లైట్ వెయిట్ రవాణా వాహనాలకు ఒకవైపు రూ.10, రానుపోను రూ.20 మేర పెంచారు.
అలాగే బస్సులు, ట్రక్కులకు రూ.25, రూ.35 మేర రవాణా ఛార్జీలు పెంచారు. ఇతర భారీ వాహనాలకు రూ.35 నుంచి రూ.50 మేర పెంచారు. 24 గంటల్లోగా తిరుగు ప్రయాణం చేసిన వాహనాలకు టోల్ ఛార్జీల్లో 25 శాతం రాయితీ ఉంటుంది. అలాగే స్థానికులు తీసుకునే నెలవారీ పాస్ ఛార్జీలు కూడా పెరిగాయి. రూ.330 నుంచి రూ.340కి పెంచారు. వచ్చే ఏడాది మార్చి 31 వరకూ ఈ టోల్ ఛార్జీలు అమల్లో ఉంటాయి.