»Toddler Girl From Bhopal Reaches Mt Everest Base Camp
Mount Everest : ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన రెండున్నరేళ్ల పాపాయి
కేవలం రెండున్నర ఏళ్ల వయసులోనే ఓ చిన్నారి ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించింది. పర్వతారోహకులైన తన తల్లిదండ్రులతో కలిసి పాప ఈ రికార్డును సొంతం చేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
Youngest Child To Climb Mount Everest : ఓ చిన్నారి వయసుకు మించిన సాహసం చేసి అందరినీ అబ్బురపరిచింది. ఔరా అనిపించుకుంది. రెండున్నరేళ్ల వయసున్న సిద్ధి మిశ్ర(SIDDHI MISHRA) ఎవరెస్టు పర్వతం బేస్ క్యాంపుపైకి చేరుకుంది. దీంతో రెండున్నరేళ్ల వయసులోనే ఎవరెస్టు బేస్ క్యాంప్ ఎక్కిన చిన్నారుల్లో ఒకరిగా నిలిచింది. పర్వతారోహకులైన తల్లితండ్రుల వెంటే ఆమే నడిచి ఈ అరుదైన రికార్డును దక్కించుకుంది.
ఎవరెస్టు(EVEREST) పర్వత శిఖరం ప్రపంచంలోనే అతి ఎత్తైనదని మనకు తెలుసు. అయితే దాన్ని ఎక్కడం అనేది మాత్రం ఆషామాషీ విషయమైతే కాదు. అక్కడి వాతావరణ పరిస్థితులను తట్టుకుని ముందుకు వెళ్లాలి. ఎముకలు కొరికే చలిలో, కరుగుతున్న హిమానీ నదాలను, ప్రతికూల వాతావరణ పరిస్థితులను దాటుకుంటూ పయనం సాగించాలి. అందుకనే పెద్దవారు కూడా చాలా మంది దీన్ని ఎక్కేందుకు భయపడుతుంటారు. అలాంటిది సిద్ధి మిశ్ర మాత్రం ఈ పని చేయగలిగింది. బుడి బుడి అడుగులు వేసుకుంటూ బేస్ క్యాంప్‌ను చేరుకుంది. సముద్ర మట్టానికి 17,598 అడుగుల ఎత్తున భారత పతాకాన్ని ఎగురవేసింది. ఎక్స్ పెడిషన్ హిమాలయ కంపెనీ ఎండీ నబీన్ త్రితాల్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. వీళ్లది మధ్యప్రదేశ్‌లోని భోపాల్.
సిద్ధి మిశ్రలాగే ఇంతకు ముందు ఈ శిఖరాన్ని అధిరోహించన రెండేళ్ల వయసు పిల్లలు ఇంకా ఉన్నారు. గత జనవరిలో స్కాట్లాండ్కు చెందిన రెండేళ్ల చిన్నారి ఎవరెస్టు బేస్ క్యాంప్‌కి చేరింది. అయితే తన తండ్రి వీపుపై మోస్తూ ఆమె చేత ఈ పర్వతారోహణ చేయించారు. అలాగే గతేడాది అక్టోబర్‌లో బ్రిటన్‌కు చెందిన మరో రెండేళ్ల బుడ్డోడు టాట్ కార్టర్ ఎవరెస్టును ఎక్కి అందరినీ ఆశ్చర్యపరిచాడు. చెక్ రిపబ్లిక్కు చెందిన నాలుగేళ్లో చిన్నారి సైతం ఎవరెస్ట్ బేస్ క్యాప్‌ను చేరింది.