ప్రధాని మోదీని, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను చంపుతామని బెదిరింపు కాల్స్ రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఫోన్ కాల్స్ ట్రేస్ చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi), ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) సీఎం యోగి ఆదిత్యనాథ్ (CM Yogi adityanath)లను చంపేస్తామంటూ ఓ వ్యక్తి బెదిరింపు కాల్ చేశాడు. ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేసి ఆ దుండగుడు బెదిరించాడు. ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమై దర్యాప్తు చేపట్టారు. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆ వ్యక్తి అడ్రస్‌ను ట్రేస్ చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో ఆ వ్యక్తి కీలక విషయాలను వెల్లడించాడు.
తనకి దావూద్ ఇబ్రహీం (Dawood Ibrahim) గ్యాంగ్ ఫోన్ చేసి బెదిరించమని చెప్పినట్లుగా తెలిపాడు. ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లను చంపుతామని బెదిరించమన్నట్లు వారు చెప్పడంతోనే అలా చేశానని నిందితుడు ఒప్పుకున్నాడు. అంతేకాకుండా ముంబైలోని జేజే హాస్పిటల్‌కి కూడా బెదిరింపు కాల్ చేయాలని వారు చెప్పినట్లుగా తెలిపాడు. బాంబులతో ఆ ఆస్పత్రిని పేల్చేస్తామని చెప్పమన్నట్లు వివరించాడు.
నిందితుడిని అరెస్ట్ చేసి అతనిపై ఐసీపీ 505 (2) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. గత నెలలో కూడా ముంబై పోలీసులకు బెదిరింపు మెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ మెయిల్లో భారత ప్రభుత్వం రూ.500 కోట్లు చెల్లించకపోయినా, గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ని విడుదల చేయకపోయినా మోదీ స్టేడియాన్ని పేల్చేస్తామంటూ ఓ వ్యక్తి మెయిల్ పంపాడు. పోలీసులు అలెర్ట్ అయ్యి అతన్ని అరెస్ట్ చేశారు. ఆ నిందితుడు గోర్గావ్కు చెందిన నాగేంద్ర శుక్లాగా పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో ఆ వ్యక్తి అలా బెదిరింపు కాల్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.