తెలంగాణ మంత్రి కేటీ రామారావు పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రి ఆలయంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దేవుడిపై కూడా వ్యాపార కోణంలో వ్యాఖ్యానించి, విమర్శల పాలవుతున్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సు నేపథ్యంలో కేటీఆర్ దావోస్‌లో ఉన్నారు. ఇక్కడ పలువురు పారిశ్రామికవేత్తలు, సంస్థల అధిపతులతో భేటీ అవుతున్నారు. తెలంగాణ-అవకాశాల ప్రపంచం పేరిట తెలంగాణ పెవిలియన్‌ను ప్రారంభించారు. పారిశ్రామికవేత్తలతో భేటీ సందర్భంగా ఆయన నోరు జారారు. ప్రభుత్వం ప్రతి అంశాన్ని పెట్టుబడిగా చూడకూడదు. ప్రజల కోసం కొన్నిసార్లు ఖర్చు చేయవలసి ఉంటుంది. దేవుడిని అనధికారికంగా ఇప్పటికే పెట్టుబడి సాధనంగా మార్చేశారు. ఇప్పుడు ఆయన నేరుగా అవే వ్యాఖ్యలు చేయడం విమర్శలకు దారి తీసింది.
దావోస్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో మాట్లాడుతూ… యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మించామని, దీనిని పెట్టుబడిగా చూడాలని వ్యాఖ్యానించారు. ‘ఈ రోజు యాదాద్రి ఆలయాన్ని 1000 కోట్ల రూపాయల నుండి 1200 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అధ్భుతంగా పునర్నిర్మించాం. ఇది భవిష్యత్తుకు పెట్టుబడి కాదా? ప్రస్తుతం యాదాద్రి హుండీ ఆదాయం ద్వారా రోజుకూ 1 కోటి రూపాయలకు పైగా ఆదాయం వస్తోంది. అంటే ఇప్పుడు మనం పెట్టిన ఈ మొత్తం పెట్టుబడి అవుతుందా లేక అప్పు అవుతుందా? ఉత్పాదక రంగంలోని ప్రతి పైసా సంపదను సృష్టిస్తుంది.’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలతో కేటీఆర్ బీజేపీకి అడ్డంగా దొరికిపోయారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్వకుంట్ల ఫ్యామిలీకి దేవాలయాలు వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయని ఆరోపించారు. యాదాద్రి ఆలయ అభివృద్ధి కూడా పెట్టుబడేనా, భక్తుల హుండీ విరాళాల కోసమే అభివృద్ధి చేశారా అని నిలదీశారు. కేసీఆర్ ఇతర రాష్ట్రాల సీఎంలకు యాదాద్రిని చూపించి, పెట్టుబడి సాధనంగా సూచించదలుచుకున్నారా అని నిప్పులు చెరిగారు.
బీజేపీ తెలంగాణ ఐటీ డిపార్టుమెంట్‌కు చెందిన వెంకటరమణ కూడా ఈ అంశంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి గుడి అభివృద్ధి అనేది మన ట్విట్టర్ టిల్లుకి ఒక పెట్టుబడి, అంటే దేవుడి మీద ప్రేమతో ఆలయ అభివృద్ధి చేయలేదు, ఆదాయం కోసమే పెట్టుబడి పెట్టినట్లు చెప్పేశారని దుయ్యబట్టారు. యాదాద్రి అభివృద్ధి వెనక అసలు నిజం ఇప్పుడు బయటకు కక్కేశారని పేర్కొన్నారు. యాదాద్రి గురించి మాట్లాడిన కేటీఆర్.. ఇలాంటి వ్యాఖ్యలు ఇతర మతాలపై మాట్లాడగలరా అని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణలో మరో పదకొండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఒక వర్గం మనోభావాలు దెబ్బతినేలా ఈ వ్యాఖ్యలు చేశారని, ఇప్పుడు కేటీఆర్, బీఆర్ఎస్ వాటిని వెనక్కి తీసుకుంటుందా? పెట్టుబడులపై చర్చ సాగుతున్న సమయంలో అనుకోకుండా జరిగిందని వివరణ ఇచ్చుకుంటుందా? చూడాలి.