G.N. Saibaba: ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా నాగ్పూర్ సెంట్రల్ జైలు నుంచి నేడు(గురువారం) విడుదలయ్యారు. రెండు రోజుల క్రితం బాంబే హైకోర్టు మావోయిస్టు లింకుల కేసులో అతడు నిర్దోషి అని తీర్పునిచ్చింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ట్రయల్ కోర్టు అప్పట్లో సాయిబాబా కేసును విచారించిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర పోలీసులు 2014లో సాయిబాబాను అరెస్ట్ చేశారు. వివిధ సెక్షన్ల కింద ఛార్జ్ షీట్ నమోదు చేశారు. 2017లో గడ్చిరోలి జిల్లా సెషన్స్ కోర్టు సాయిబాబాతో పాటు మరో ఐదుగురికి జీవిత ఖైదు విధించింది.
ఆ తర్వాత సాయిబాబా ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఉద్యోగం కూడా కోల్పోయారు. అయితే ఈ తీర్పుపై సాయిబాబా అప్పీలు చేసుకున్నారు. యూఏపీఏ కేసులో పోలీసులు నిబంధనలను సరిగ్గా పాటించకపోవడంతో 2022లో సాయిబాబాపై బాంబే హైకోర్టు కేసును కొట్టివేసింది. ఆ తర్వాత ఈ తీర్పుపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో అప్పట్లో సాయిబాబా విడుదల నిలిచిపోయింది. సాయిబాబా కేసును మళ్లీ విచారించాలని బాంబే హైకోర్టును ఆదేశించింది. దీనిపై విచారణ జరిపిన బాంబే హైకోర్టు సాయిబాబా సహా ఆరుగురిని విడుదల చేయాలని ఆదేశించింది.