యావత్ దేశం 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్న సందర్భంగా ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుల కలలు నిజం కావాలంటే ఉమ్మడిగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్రధాని ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. భారతీయులు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ… స్వాతంత్ర్య అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న సమయంలో నేటి గణతంత్ర దినోత్సవం విశిష్టమైనదని తెలిపారు. దేశం కోసం అసువులు బాసిన స్వాతంత్ర్య సమరయోధుల కలలు నిజం కావాలంటే ఉమ్మడిగా ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
మోడీ పేర్కొన్నట్లు ఈ గణతంత్ర వేడుకలకు ప్రత్యేకత ఉంది. గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రతి ఏటా నిర్వహించే వేదిక, బ్రిటీష్ కాలం నాటి రాజ్‌పథ్‌ను పునరుద్ధరణ అనంతరం కర్తవ్య పథ్ గా పేరు మార్చారు. ఇక్కడే తొలిసారి గణతంత్ర వేడుకలు నిర్వహించారు. గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా ఈజిప్ట్ అధ్యక్షులు పాల్గొన్నారు. కర్తవ్య పథ్ వేడుకల్లో 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, 6 మంత్రిత్వ శాఖలు, విభాగాలు పాల్గొన్నాయి. వందేభారతం డ్యాన్స్ కాంపిటీషన్ కోసం దేశవ్యాప్తంగా 479 మంది కళాకారులను ఎంపిక చేశారు. అలాగే భారత తొలి ప్యాసింజర్ డ్రోన్ ప్రదర్శన, ప్రపంచంలో తొలి మహిళా ఒంటెల రైడర్ల ప్రదర్శన, ఎయిర్ ఫోర్స్‌కు చెందిన గరుడ్ కమాండోస్ తొలిసారి రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొనడం… ఇలా పలు ప్రత్యేకతలు ఉన్నాయి.