»Pm Narendra Modi Comments Northeast States Election Results
Elections Results ‘నన్ను చనిపో అంటుంటే.. కానీ ప్రజలు వద్దంటున్నారు’: మోదీ
ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ ఫలితాలు షాక్ ఇవ్వగా.. త్రిపుర (Tripura), నాగాలాండ్ (Nagaland) రాష్ట్రాల ఫలితాలు కాషాయ పార్టీకి జోష్ నిచ్చాయి. ఫలితాల వెల్లడి అనంతరం ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కమలం నాయకులు సమావేశమయ్యారు. మర్ జా (చనిపో మోదీ) అని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయని.. ప్రజలు మాత్రం మత్ జా (వెళ్లొద్దు మోదీ) అని నినదిస్తున్నారు
ఈశాన్య ప్రాంతం (Northeast States)లోని రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని సుస్థిరం చేసుకున్న బీజేపీ (BJP) సంబరాల్లో మునిగి తేలింది. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ ఫలితాలు షాక్ ఇవ్వగా.. త్రిపుర (Tripura), నాగాలాండ్ (Nagaland) రాష్ట్రాల ఫలితాలు కాషాయ పార్టీకి జోష్ నిచ్చాయి. ఫలితాల వెల్లడి అనంతరం ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కమలం నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ (Modi), అమిత్ షా (Amit Shah) ద్వయంపై మరోసారి ప్రశంసలు కురిపించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) ఈ విజయానికి కారణం మోదీ పాలన కారణంగా పేర్కొన్నారు. ఈ విజయంపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. ‘త్రివేణి సంగమం’ (Triveni Sangamam) విజయానికి కారణం అని తెలిపారు.
‘ప్రజా క్షేత్రంలో పార్టీ వరుస విజయాల వెనుక త్రివేణి సంగమంలా.. ఇతర రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి, వాటి పని సంస్కృతి, పార్టీ కార్యకర్తల అంకితభావం ఉన్నాయి. ఈ ఫలితాలు ప్రజాస్వామ్యంపై, ప్రజాస్వామ్య వ్యవస్థలపైన ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని దేశంతోపాటు ప్రపంచానికి చాటి చెప్పాయి. ఈశాన్య ప్రాంతం ఢిల్లీకి, దిల్ (హృదయానికి)కి ఎక్కువ దూరంలో లేదన్న సంగతి ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. మళ్లీ అధికారం నిలబెట్టుకోవడం పార్టీ కార్యకర్తలకు గర్వకారణం. మర్ జా (చనిపో మోదీ) అని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయని.. ప్రజలు మాత్రం మత్ జా (వెళ్లొద్దు మోదీ) అని నినదిస్తున్నారు’ అని మోదీ పేర్కొన్నారు. అంతకుముందు ఎన్నికల ఫలితాలపై ట్విటర్ (Twitter)లో స్పందించారు. ‘త్రిపుర ప్రజలు అభివృద్ధి, స్థిరత్వానికి ఓటేసి బీజేపీని గెలిపించారు. ఎన్ డీపీపీ-బీజేపీ కూటమికి మరోసారి విజయం అందించిన నాగాలాండ్ ప్రజలందరికీ ధన్యవాదాలు’ అని మోదీ ట్వీట్ చేశారు.
ఇక ఈ ఫలితాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు. ‘ఈశాన్య భారతానికి ఇది చారిత్రక దినం. శాంతి, అభివృద్ధి, శ్రేయస్సు కోసం ప్రజలు మోదీ నేతృత్వంలోని బీజేపీ వైపే చూస్తున్నారని ఈ ఫలితాలతో మరోసారి రుజువైంది’ అని అమిత్ షా పేర్కొన్నాడు. ‘ఈశాన్య రాష్ట్రాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు ప్రధాని మోదీ చేసిన కృషి, అభివృద్ధి కోసం తీసుకొచ్చిన విధానాలతో బీజేపీ విజయం సాధించింది. ఈశాన్యాన్ని కాంగ్రెస్ ఏటీఎంలా భావిస్తే మోదీ శాంతి, అభివృద్ధికి దారి చూపారు’ అని జేపీ నడ్డా తెలిపారు.
కాగా ఈశాన్య రాష్ట్రాలు మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్ ఎన్నికల ఫలితాలు ఇలా ఉన్నాయి. త్రిపుర: మరోసారి బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకుంది. మొత్తం 60 సీట్లలో బీజేపీ కూటమి 33 స్థానాలు సొంతం చేసుకుంది. బీజేపీ 32 స్థానాల్లో గెలవగా.. మిత్రపక్షం ఐపీఎఫ్ టీకి ఒక స్థానానికి పరిమితమైంది. ఇక తిప్రా మోథా పార్టీ 13 స్థానాల్లో గెలిచి బీజేపీకి షాకిచ్చింది. వామపక్షాలు, కాంగ్రెస్ కలిసి 14 స్థానాలు (సీపీఎం11, కాంగ్రెస్ 3) సొంతం చేసుకున్నాయి. ఫార్వర్డ్ బ్లాక్, సీపీఐ, ఆర్ఎస్పీ ఒక్క స్థానం కూడా దక్కించుకోలేకపోయాయి.
నాగాలాండ్: మొత్తం 60 స్థానాల్లో బీజేపీ కూటమికి 37 స్థానాలు దక్కాయి. ఎన్ డీపీపీ 25 ఎమ్మెల్యేలు, బీజేపీ 12 గెలుచుకున్నాయి. ఎన్ సీపీ 7, నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్ పీపీ) 5, ఎల్ జేపీ 2, ఆర్ పీఐ 2, ఎన్ పీఎఫ్ 2, జేడీయూ 1 స్థానంలో విజయం సాధించాయి.
కాంగ్రెస్ కు ఒక్క సీటు దక్కలేదు.
మేఘాలయ: ఇక్కడి ప్రజలు ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం ఇవ్వలేదు. మొత్తం 60 స్థానాల్లో ఒకటి ఏకగ్రీవం కాగా.. 59 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్ పీపీ) 26 సీట్లు సొంతం చేసుకుని అతి పెద్ద పార్టీగా అవతరించింది. యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ (యూడీపీ) 11 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 5, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 5 స్థానాలు సొంతం చేసుకుంది. బీజేపీ రెండు సీట్లకు పరిమితమైంది. కాగా ఎన్ పీపీ, యూడీపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ కూటమి ప్రభుత్వమే కొనసాగుతున్న విషయం తెలిసిందే.