Himachal Pradesh: భారీ హిమపాతం.. రహదారులన్నీ మూసివేత!
హిమాచల్ ప్రదేశ్లో భారీగా మంచు కురుస్తోంది. ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయికి పడిపోయాయి. మూడు రోజుల నుంచి మంచు వర్షం కురుస్తూనే ఉండడంతో రహదారులన్నీ మూసివేశారు.
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్లో భారీగా మంచు కురుస్తోంది. ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయికి పడిపోయాయి. మూడు రోజుల నుంచి మంచు వర్షం కురుస్తూనే ఉంది. ఇళ్లు, రహదారులు, వాహనాలు, చెట్లపై భారీగా హిమపాతం పడుతోంది. రోడ్లు మొత్తం మంచుతో తెల్లగా కనిపిస్తున్నాయి. చాలా చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ తీవ్రమైన మంచు వల్ల అధికారులు పలు రహదారులను మూసివేశారు.
ఐదు జాతీయ రహదారులతో పాటు 650 రహదారులను మూసివేసినట్లు సమాచారం. అలాగే లాహౌల్, స్పితి జిల్లాలోని స్పితి వ్యాలీలో భారీగా మంచు కురుస్తోంది. దీంతో అధికారులు 290 రహదారులను మూసివేశారు. సిమ్లాలో 149, చంబాలో 100, కిన్నౌర్లో 75, కులులో 32, మండిలో ఐదు రహదారులను మూసివేశారు. భారీ హిమపాతం కారణంగా స్పితి వ్యాలీలో 81 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. వాళ్లను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చాలా ప్రదేశాల్లో విద్యుత్, నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
లాహౌల్, స్పితిలోని జస్రత్ గ్రామ సమీపంలో గల దారా జలపాతాన్ని భారీగా హిమపాతం తాకింది. అక్కడ నీటి ప్రవాహానికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. జోబ్రాంగ్, రాపి, జస్రత్, తరండ్, థారోట్ చుట్టుపక్కల గ్రామాల నివాసితులు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో సమీపంలోని పోలీసు స్టేషన్ను సంప్రదించాలని సూచించారు.