దక్షిణాదిన బీజేపీ ఎప్పటికిీ గెలవదని, కేవలం గోమూత్ర రాష్ట్రాల్లోనే గెలుస్తుందని డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ అన్న మాటలకు బీజేపీ ధ్వజమెత్తింది. మరోవైపు కాంగ్రెస్ సైతం ఖండించింది. దీంతో బుధవారం పార్లమెంట్లో తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు.
DMK MP: ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీకి(DMK) చెందిన ఎంపీ డీఎన్వీ సెంథిల్ కుమార్(Senthilkumar) బుధవారం పార్లమెంట్లో క్షమాపణలు చెప్పారు. మంగళవారం జమ్మూ & కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా సెంథిల్‌కుమార్ మాట్లాడుతూ, బీజేపీ గోమూత్ర రాష్ట్రాలుగా పిలవబడే హిందీ రాష్ట్రాల్లో మాత్రమే గెలుపొందిందని పేర్కొన్నారు. ఆయన మాటలపై బీజేపీ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఎంపీ మాటలను తప్పుబట్టింది. దీంతో సెంథిల్ కుమార్ క్షమాపణ చెప్పారు.
ఈ సందర్భంగా సెంథిల్ మాట్లాడుతూ.. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి మాట్లాడుతూ.. దక్షిణాదిలో బీజేపీ(BJP) గెలవడం అసాధ్యమని, కేవలం హిందీ మాట్లాడే రాష్ట్రాల్లోనే ఆ పార్టీ గెలుస్తోందన్నారు. ఈ క్రమంలోనే ఆయన హందీ మాట్లాడే గో మూత్ర రాష్ట్రాలలోనే బీజేపీ గెలుస్తుందని పోల్చారు. ఆ పదాన్ని లోక్‌సభ స్పీకర్ రికార్డుల నుంచి తొలగించారు. అప్పటికే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ఆయన స్పందిస్తూ.. ఎన్నికల ఫలితాల గురించి మాట్లాడుతూ.. పొరపాటున ఆ పదం వాడానని, ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఇది తప్పుగా వెళ్తుందని క్షమాపణలు చెప్పారు. దీనిపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణాదిలో ఇండియా కూటమి లేకుండా చేస్తామని ఘాటుగా వ్యాఖ్యానించారు. పార్లమెంట్లో ఇలాంటి పదజాలంతో మాట్లాడడం సరైనది కాదని ఎంపీ కార్తీ చిదంబరం హితవు పలికారు.