Devotee Married Lord Krishna : ప్రతి ఒక్కరికీ ఏదో ఒక దేవుడిపై ఇష్టం ఉంటుంది. అలాగే మధ్యప్రదేశ్‌లో ఉండే ఓ యువతికి చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడు అంటే చెప్పలేనంత ఇష్టం. ఆయనపై ఎంతో ప్రేమను పెంచుకుంది. దీంతో గ్వాలియర్‌కు చెందిన శివాని పరిహార్ అనే యువతి పెళ్లి చేసుకుంటే శ్రీకృష్ణుడినే చేసుకోవాలని తలచింది. బంధుమిత్రుల సమక్షంలో వరుడి స్థానంలో శ్రీకృష్ణ(Sri Krishna) ప్రతిమను ఉంచి వివాహం చేసుకుంది.
శివానీ పరిహార్‌కు చిన్నప్పటి నుంచి కృష్ణుడి మీద అపరిమితమైన ప్రేమ. వయసు పెరుగుతున్న కొద్దీ కృష్ణ భక్తీ పెరుగుతూ వచ్చింది. దీంతో తల్లిదండ్రుల్ని ఒప్పించి ఆయననే వివాహం చేసుకోవాలనుకుంది. తల్లిదండ్రులు మొదట ఈ విషయం విని ఆశ్చర్యపోయారు. తర్వాత ఆమె పట్టుదల చూసి ఒప్పుకొన్నారు. అలా చివరికి కృష్ణుడిని వివాహం చేసుకుంది. వివాహ తంతు(WEDDING CEREMONY) అంతా వారి ఆచార వ్యవహారాల ప్రకారం జరిగింది. అక్కడి బృందావన్ నుంచి శ్రీకృష్ణుడు కూడా బ్యాండు మేళాలతో ఊరేగింపుగా వచ్చాడు. పెళ్లి జరిగిన తర్వాత వధువు తరఫు బంధువులు అప్పగింతల కార్యక్రమాన్ని కూడా శాస్త్రోక్తంగా జరిపారు.
దీంతో ఈ ఆసక్తికరమైన పెళ్లిని చూసేందుకు స్థానికంగా ఉన్న వారంతా తరలివచ్చారు. ఎంతో వైభవంగా, వేద మంత్రాల మధ్య వీరిద్దరి పెళ్లి జరిగింది. వివాహం తంతు పూర్తయిన తర్వాత వారిద్దరికీ వివాహ ప్రమాణ పత్రం కూడా వచ్చింది. ఆ తర్వాత వధువు వరుడి వెనుక బృందావనానికి వెళ్లిపోయింది. ఇప్పటి నుంచి కృష్ణ సేవలో బృందావనంలోని రాధా ధ్యాన్ ఆశ్రమంలో గడుపుతానని శివానీ(SHIVANI) వెల్లడించింది.