ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు సీబీఐ షాక్ ఇచ్చింది. ఆయన పైన ఉన్న అవినీతి కేసులో దర్యాఫ్తును తిరిగి ప్రారంభించింది. యూపీఏ 1 హయాంలో ఆయన కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రైల్వే ప్రాజెక్టులలో అవకతవకలు జరిగినట్లుగా గుర్తించింది. ఇందుకు సంబంధించి 2018లో సీబీఐ విచారణను ప్రారంభించింది. నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూతో ఆర్జేడీ జత కట్టిన కొద్ది నెలలకు ఈ విచారణ తిరిగి ప్రారంభం కావడం గమనార్హం. ఈ విచారణ 2021లో క్లోజ్ అయింది. ఇందుకు సంబంధించి వచ్చిన ఆరోపణలపై ఎలాంటి కేసు నమోదు కాలేదని నాడు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, కూతుళ్లు చందా యాదవ్, రాగిణి యాదవ్ నిందితులుగా ఉన్నారు.
ఓ రియల్ ఎస్టేట్ గ్రూప్ నుండి ఢిల్లీలో ఓ ఆస్తిని లాలూ ప్రసాద్ యాదవ్ లంచంగా తీసుకున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ముంబై బాంద్రా రైల్ అండ్ లీజు ప్రాజెక్టు, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ రీవ్యాంప్కు సంబంధించి సదరు గ్రూప్ ఆసక్తిని కనబరించింది. సదరు రియల్ ఎస్టేట్ సంస్థ షెల్ కంపెనీ ద్వారా రూ.30 కోట్ల మార్కెట్ వ్యాల్యూ కలిగిన భవనాన్ని, రూ.5 కోట్లకు మాత్రమే కొనుగోలు చేశారని, ఆ తర్వాత దీనిని వీరికి బదలీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం లాలూ ప్రసాద్ యాదవ్ వయస్సు 73 ఏళ్లు. ఇప్పటికే దాణా కుంభకోణం కేసులో శిక్షను అనుభవిస్తున్నారు. అనారోగ్యం కారణంగా బెయిల్ పైన ఉన్నారు.
కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కోసం సింగపూర్‌కు వెళ్లేందుకు కోర్టు అనుమతి పొందారు లాలూ. కుమార్తె కిడ్నీ దానం చేయడంతో ఆపరేషన్ కూడా చేయించుకున్నారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు. మరోవైపు నితీష్ కుమార్ పదేపదే తమ కూటమిలోని పార్టీ మారుస్తున్నారు. ఆగస్ట్ నెలలో బీజేపీతో బంధం తెంచుకొని, ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో జత కట్టి, ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. తేజస్వి యాదవ్‌కు ఉపముఖ్యమంత్రి పదవి దక్కింది.