మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ సతీమణి అమృత (Amruta Fadnavis)ను మనీ కోసం బ్లాక్మెయిల్ చేసిన కేసులో సరికొత్త విషయాలు బయటికి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన క్రికెట్ బుకీ అనిల్ జైసింఘానీ (Anil Jaisinghani)ని అమృతా ఫడణవీస్ సాయంతోనే పట్టుకున్నట్లు పోలీసులు తమ ఛార్జ్‌షీట్‌లో వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే అంతకుముందు అనిల్ ఆమెను బ్లాక్మెయిల్ చేస్తూ పంపించిన మెసేజ్‌లను కూడా పోలీసులు ఛార్జ్‌షీట్‌లో ప్రస్తావించారు. ‘ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) నేతృత్వంలోని సంకీర్ణ కూటమిని కూల్చింది మీరే’నంటూ ఆ బుకీ అమృతకు మెసేజ్ చేసి బెదిరించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పలు జాతీయ మీడియా కథనాలు వచ్చాయి.‘
మహా వికాస్ అఘాడీ (Maha Vikas Aghadi) కూటమి ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఏక్నాథ్ శిందే(Eknath Shinde), అనిల్ పరాబ్‌ను ట్రాప్ చేయాలని గత శివరాత్రి (మార్చి 1, 2022) రోజును మీరు మీ వాళ్లకు చెప్పారు. అందుకు సంబంధించిన అన్ని రికార్డులు, ఆధారాలు నా వద్ద ఉన్నాయి. నేను పంపిన వీడియోలన్నీ నిజమైనవే. అవన్నీ తప్పుడు వీడియోలైతే..! అని మీరు అనొచ్చు. కానీ, మీరో విషయాన్ని గుర్తుంచుకోవాలి. కెమెరాలు ఎప్పుడూ అబద్ధాలు చెప్పవు. నేను నార్కో పరీక్షలకైనా సిద్ధమే. మరి మీరు?’’ అని అనిల్ జైసింఘానీ అమృత్‌కు సందేశం పంపినట్లు పోలీసులు ఆ ఛార్జ్‌షీట్‌లో తెలిపారు. దీనికి అమృత (Amruta Fadnavis) బదులిస్తూ.. ‘‘ఏంటీ డబ్బు..? మీకు తెలియని వ్యక్తితో ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు?’’ అని బుకీకి అడిగినట్లు తెలిపారు.