మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరే(Uddhav Thackeray)కు మరో షాక్ తగిలింది. ఆయన వర్గానికి చెందిన మహిళా ఎమ్మెల్సీ మనీషా కయాండే(MLC Manisha Kayande) థాకరే వర్గాన్ని వీడి శివసేనలో జాయిన్ అయింది. ఉద్ధవ్ పార్టీ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తమకు అందడం లేదని, ఉద్ధవ్ వర్గీయులు మహిళల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆమె విమర్శించింది. ఉద్ధవ్ వర్గాన్ని నేతలు వరుసగా ఎందుకు వదిలిపెడుతున్నారనే దానిపై ఆయన ఏడాది కాలమైనా దృష్టి సారించలేదని తెలిపారు. బాలాసాహెబ్ థాకరే స్థాపించిన ఒరిజినల్ శివసేన ఏక్ నాథ్ షిండేదేనని(Ek Nath Shinde) అన్నారు. కాంగ్రెస్, ఎన్సీపీ అజెండాలను సంజయ్ రౌత్(Sanjay Raut), సుష్మ అంధారేలు అమలు చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు కయాండేను ఉద్ధవ్ వర్గం పార్టీ నుంచి బహిష్కరించింది.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆమెపై వేటు వేసింది. పార్టీ నుంచి బహిష్కరణకు గురైనప్పటికీ ఆమె ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు. మరోవైపు ఉద్ధవ్ వర్గం స్పందిస్తూ… మరోసారి ఎమ్మెల్సీ పదవి దక్కదనే కారణంతోనే ఆమె పార్టీని వీడారని విమర్శించింది. మనీషా కయాండే (Manisha Kayande)షిండే వర్గంలో చేరడంపై ఉద్దవ్ వర్గానికి చెందిన సంజయ్ రౌత్(Sanjay Raut) స్పందించారు. కొందరు స్వార్థం కోసం పార్టీలో చేరుతున్నారని, స్వార్థం కోసం పార్టీని వీడుతున్నారని అన్నారు. మనీషా కయాండే మా వర్గాన్ని వీడటం వల్ల మాకు ఎలాంటి నష్టం లేదని సంజయ్ రౌత్ చెప్పారు. స్వార్థపరులను గుర్తించడంలో మేము తప్పు చేశాము. గత కొన్నేళ్లుగా ఈ తప్పు జరుగుతోందని అన్నారు. నేను ఉద్దవ్ ఠాక్రేతో కూడా దీని గురించి చర్చిస్తున్నానని రౌత్ చెప్పారు.