»Blue Aadhaar Card Who Is Given This Card How To Apply
Blue Aadhaar Card: ఈ కార్డు ఎవరికి ఇస్తారు? అప్లై చేసుకోవడం ఎలా?
సాధారణంగా ఆధార్ కార్డులు తెలుపురంగులో ఉంటాయని మనందరికీ తెలిసిందే. మరి బ్లూ ఆధార్ కార్డు గురించి ఎప్పుడైనా విన్నారా? మరి ఈ బ్లూ ఆధార్ కార్డు అంటే ఏంటి వివరాలు తెలుసుకుందాం.
Blue Aadhaar Card: దేశ పౌరులందరికీ ఆధార్ కార్డు తప్పనిసరి. ప్రభుత్వ పథకాలు పొందాలంటే ఆధార్ ఉండాల్సిందే. ధ్రువీకరణ పత్రంగా ఇది ఉపయోగపడుతోంది. సాధారణంగా ఆధార్ కార్డులు తెలుపురంగులో ఉంటాయని మనందరికీ తెలిసిందే. మరి బ్లూ ఆధార్ కార్డు గురించి ఎప్పుడైనా విన్నారా? దీనిని బాల ఆధార్‌గా పేర్కొంటారు. నీలి రంగులో ఉండే ఆధార్ కార్డులను ప్రత్యేకంగా పిల్లలకు జారీ చేస్తారు. బాల ఆధార్ అనేది ఐదేళ్లలోపు పిల్లలకు జారీ చేస్తారు. ఇందులో పిల్లల బయోమెట్రిక్ వివరాలేవీ అక్కర్లేదు. కేవలం ఫొటో, పేరు, చిరునామా, తల్లిదండ్రుల పేరు వంటి ప్రాథమిక సమాచారంతో ఆధార్‌ను జారీ చేస్తారు. వీరి కార్డును తల్లిదండ్రుల ఆధార్ సంఖ్యతో అనుసంధానిస్తారు. బాల ఆధార్ కార్డు కాలపరిమితి పిల్లల వయసు ఐదేళ్ల వరకు ఉంటుంది.
బాల ఆధార్‌ను అప్లే చేసుకోవడం ఎలా అంటే?
తల్లిదండ్రులు ఆధార్ కార్డు, చిరునామా, పిల్లల జనన ధ్రువీకరణ పత్రం, ఒక ఫొటో తీసుకుని ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లాలి. ఆధార్ నమోదు ఫారంను తీసుకుని, అందులో తల్లిదండ్రుల ఆధార్ వివరాలను అందజేయాలి. ఈ ఫారాన్ని ఉడాయ్ వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. తల్లిదండ్రుల మొబైల్ నంబర్‌నే పిల్లల ఆధార్ కార్డుకు అనుసంధానిస్తారు. నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత సందేశం వస్తుంది. అక్నాలెడ్జ్మెంట్ స్లిప్‌ను తీసుకోవాలి. అందులోని ఎన్రోల్మెంట్ ఐడీతో పిల్లల ఆధార్ కార్డు అప్లికేషన్ వివరాలు పొందవచ్చు. 60 రోజుల్లోగా మీ పిల్లల పేరుపై బాల ఆధార్ కార్డును జారీ చేస్తారు. అయితే ఈ బ్లూ ఆధార్ కార్డు ఉచితంగా ఇస్తారు.