»Aditya L1 Mission India Will Conduct Research On The Sun Aditya L 1 Mission Next Week
Aditya-L1 Mission: సూర్యుడిపై భారత్ పరిశోధనలు..వచ్చేవారం నింగిలోకి ఆదిత్య ఎల్-1 మిషన్
భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ అయిన ఇస్రో మరో కీలక విషయం ప్రకటించింది. సూర్యునిపై పరిశోధనలు చేయడానికి ఆదిత్య ఎల్-1 శాటిలైట్‌ను ప్రయోగించనున్నట్లు తెలిపింది.
చంద్రయాన్-3 (Chandrayan-3) ప్రయోగం సక్సెస్ అయ్యాక ఇస్రో (ISRO) మరింత ఉత్సాహంతో ముందుకు దూసుకెళ్తోంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరికొన్ని ప్రయోగాలను చేపట్టేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో ఆదిత్య ఎల్-1 (Aditya-L1 Mission) ప్రయోగాన్ని చేపట్టనున్నట్లు ప్రకటించింది. మరో వారం రోజుల్లో ఈ ప్రయోగాన్ని చేపట్టనుంది. సెప్టెంబర్ 2వ తేదిన ప్రయోగాన్ని చేపట్టేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది.
భారత్ చేపట్టే ఈ మిషన్ (Mission) ద్వారా సూర్యుడి (SUN)పై ప్రయోగాలు చేయనుంది. సూర్యుడి పుట్టుక గురించి, అక్కడి పరిస్థితుల గుట్టు విప్పేందుకు ఆదిత్య ఎల్-1 ప్రయోగాన్ని చేపట్టనున్నట్లు ఇస్రో ప్రకటించింది. ఈ శాటిలైట్‌ను భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాంగ్రేజ్ పాయింట్ 1 వద్ద ఉన్న కక్ష్యలోకి ఇస్రో ప్రవేశపెట్టనుంది. ఆ ఉపగ్రహం ద్వారా అతి దగ్గరి నుంచి సౌర వ్యవస్థపై నిఘా పెట్టనున్నట్లు ఇస్రో తెలిపింది.
సౌర తుఫానులు, సూర్యుడి (SUN) పుట్టుక, అక్కడున్నటువంటి వాతావరణం, సూర్యుని ఉపరితలం వద్ద గల పరిస్థితులపై ఆదిత్య ఎల్-1 (Aditya-L1 Mission) పరిశోధనలు చేయనుంది. అందుకోసం ఏడు పేలోడ్స్‌ను అక్కడికి తీసుకెళ్లనుంది. ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, సూర్యుడి బయటి పొరపై అధ్యయనం చేయనుంది. ఆదిత్య ఎల్-1 అనే శాటిలైట్ పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో రూపొందించింది.
బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (IIA), పూణె ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ ఈ మిషన్ కోసం చాలా కష్టపడ్డాయని, ఈ ప్రయోగం కోసం అవి పేలోడ్స్‌ను అభివృద్ధి చేసినట్లు ఇస్రో వెల్లడించింది. ప్రయోగం కోసం రెండువారాల కిందటే పేలోడ్స్ ఏపీ శ్రీహరికోట (Sriharikota)లోని ఇస్రో స్పేస్ స్టేషన్‌కు చేరుకున్నాయని, సెప్టెంబర్ 2వ తేదిన ఆదిత్య ఎల్-1 (Aditya-L1 Mission)ను ప్రయోగించనున్నట్లు ఇస్రో వర్గాలు తెలిపాయి.