»A 5 Day Old Baby Was Brain Dead Three Children Survived
Organ Donation: 5 రోజుల శిశువుకు బ్రెయిన్ డెడ్..ముగ్గురి పిల్లలను కాపాడారు!
ఓ శిశువు బ్రెయిన్ డెడ్ అయ్యి ప్రాణాలు పోవడంతో ఆ శిశువు అవయవాలను మరో ముగ్గురు శిశువులకు అమర్చారు. దీంతో మూడు ప్రాణాలు నిలిచాయి. ఈ సంఘటన గుజరాత్లో చోటుచేసుకుంది.
ఐదు రోజుల శిశువుకు బ్రెయిన్ డెడ్ అయ్యింది. అయితే ఆ శిశువు తన ప్రాణాలు వదిలి ఇప్పుడు మరో ముగ్గురి శిశువుల ప్రాణాలు నిలిపాడు. చనిపోయిన శిశువు కాలేయాన్ని తొమ్మిది నెలల చిన్నారికి, రెండు కిడ్నీలను ఇద్దరు పిల్లలకు ట్రాన్స్‌ప్లాంట్ చేయడంతో (Organ Donation) వారి ప్రాణాలు దక్కాయి. ఈ ఘటన గుజరాత్ లోని సూరత్‌లో చోటుచేసుకుంది. అక్టోబర్ 13వ తేదిన ప్రైవేట్ ఆస్పత్రిలో చేతన అనే మహిళ పండంటి బాబుకు జన్మనిచ్చింది. అయితే ఆ దంపతుల సంతోషం కొన్ని గంటలే నిలిచింది.
పసిబాబులో ఎలాంటి కదలిక లేదని డాక్టర్లు వెల్లడించారు. దీంతో మరో ప్రైవేట్ ఆస్పత్రికి ఆ బాబును తరలించారు. ఆ శిశువును వెంటిలేటర్‌పై ఉంచినా బాబు బతికే అవకాశం లేదని తేల్చి చెప్పారు. ఐదు రోజుల తర్వాత ఆ బాబుకు బ్రెయిన్ డెడ్ అయినట్లుగా వైద్యలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎన్జీవో సంస్థ జీవన్‌దీప్ అవయవ దానం ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ విపుల్‌కు ఆ శిశువు గురించి తెలిసింది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్‌తో కలిసి ఆ శిశువు తల్లిదండ్రులైన చేతన, హర్షాను కలిసి అవయవదానం గురించి తెలిపారు.
బ్రెయిన్ డెడ్ అయిన పసి బాబు అవయవాలు దానం చేయాలని ఆ తల్లిదండ్రులను కోరి చివరకు వారిని ఒప్పించగలిగారు. ఈ తరుణంలో పీపీ సవానీ ఆసుపత్రి వైద్యులు బుధవారం శిశువు శరీరం నుంచి రెండు మూత్రపిండాలు, రెండు కార్నియాలు, కాలేయం, ప్లీహాన్ని సేకరించి వాటిని తరలించారు. ఢిల్లీకి తరలించిన శిశువు కాలేయాన్ని తొమ్మిది నెలల చిన్నారికి అమర్చగా, రెండు మూత్రపిండాలు 13, 15 ఏళ్ల పిల్లలకు అమర్చారు. దీంతో ముగ్గురి శిశువుల ప్రాణాలు నిలిచాయి.