»Sundaram Master Movie Review Was Harsha Impressed With The First Movie
Sundaram Master Movie Review: మొదటి సినిమాతో హర్ష మెప్పించాడా?
యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ క్రేజ్ సంపాదించిన వైవా హర్ష ప్రధాన పాత్రలో సుందరం మాస్టర్‌గా కనిపించాడు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు సినిమా వచ్చింది. ఈ సినిమాకి మాస్ మహారాజా రవితేజ నిర్మాత. అయితే టీజర్, ట్రైలర్‌తో సినిమా మీద హైప్ క్రియేట్ అయ్యింది. మరి హర్ష ప్రధాన పాత్రలో సుందరం మాస్టర్‌తో మెప్పించాడా? లేదా? రివ్యూలో తెలుసుకుందాం.
చిత్రం: సుందరం మాస్టర్ నటీనటులు:వైవా హర్ష, దివ్వ శ్రీపాద సంగీతం: శ్రీచరణ్ పాకాల దర్శకత్వం: కళ్యాణ్ సంతోష్ నిర్మాత: రవితేజ, సుధీర్ కుమార్ కుర్ర విడుదల: 23/02/2024
కథ
సుందర్రావు(వైవా హర్ష) విశాఖపట్నం జిల్లా పాడేరు నియోజకవర్గం పరిధిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తూ ఉంటాడు. సుందర్రావుకి ఇంకా పెళ్లి కాలేదు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తుండటంతో కట్నం బాగానే వస్తుంది.. ఇంకా ఎక్కువ వస్తుందనే ఆశతో వచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టుకుంటాడు. ఇలాంటి సమయంలో ఆ ప్రాంత ఎమ్మెల్యే(హర్ష వర్ధన్) అతనికి ఒక పని చెబుతాడు. అడవుల్లో ఉండే ఒక గూడానికి వెళ్లి అక్కడ ఉన్నవారికి చదువు చెప్పాలని, చదువు చెప్పిన తర్వాత వాళ్లని నియోజకవర్గంలో ఓటర్లుగా చేర్చేందుకు ప్రయత్నించాలని చెబుతాడు. అంతేకాక రహస్యంగా మరొక పని కూడా చెబుతాడు. దీంతో సుందరం మాస్టర్ ఆ గుడారానికి వెళ్తాడు. ఆ గూడెం పెద్ద (కేజిఎఫ్ బాలకృష్ణ), మైనా(దివ్య శ్రీపాద) అలాగే ఆ గూడెంలో ఉన్న ఇతరులు సుందరం మాస్టర్‌ను అనుమానించి చెట్టుకు కట్టేస్తారు. అసలు చెట్టుకు ఎందుకు కట్టేస్తారు? గూడెంకి వెళ్లిన సుందరం మాస్టర్ ఎమ్మెల్యే చెప్పిన పని చేశాడా? ఎమ్మెల్యే చెప్పిన పని చేసేందుకు అక్కడికి వెళ్లిన సుందరం మాస్టర్ చివరికి ఏం చేశాడు? అసలు ఎమ్మెల్యే చెప్పిన ఆ రహస్య పని ఏంటి? తెలియాలంటే ధియేటర్లో సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
సినిమాను ల్యాగ్ చేయకుండా డైరక్టర్ కథలోకి తీసుకెళ్లాడు. అత్యాశ కలిగిన ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు డీఈవో పోస్ట్ వస్తుందని ఆశపడి అడవిలో ఒక గూడానికి వెళ్తాడు. ఇంగ్లీష్ పెద్దగా రాని సోషల్ టీచర్ నల్లగా ఉన్నాడనే ఒకే ఒక కారణంతో ఆ గూడానికి వెళ్లాల్సి వస్తుంది. అలా గూడానికి వెళ్లిన అతను మొదటి రోజే టీచర్ కాదేమో అని అక్కడి గూడెం ప్రజలకు అనుమానం రావడంతో అతన్ని బంధిస్తారు. అక్కడే ఉన్న ఒక గూడెం వ్యక్తి సాయంతో వాళ్లు పెట్టిన పరీక్ష పాసైన సుందరం మాస్టర్ చేసే పనులన్నీ ఫన్నీగా ఉంటాయి. కథ మొత్తం మొదటి సగంలోనే కనిపిస్తుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్ సినిమా మీద ఇంకా ఆసక్తి పెరిగేలా చేస్తుంది. మొదటి భాగం కొంచెం కామెడీ అనిపించినా ఇంటర్వెల్ తర్వాత నుంచి కథ సీరియస్‌గా సాగుతూ ఉంటుంది. ఆ గూడెం ప్రజల ప్రవర్తన, వారి పరిస్థితిని చూసిన తర్వాత సుందరం మాస్టర్ వారిపై ఉన్న అభిప్రాయాన్ని మార్చుకుంటాడు. ఫస్ట్ హాఫ్ కామెడీ ఉండగా.. సెకండ్ హాఫ్‌లో మాత్రం ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కథ బాగుంది. కానీ డైరెక్టర్ ప్రేక్షకులకు చెప్పడంలో విఫలమయ్యాడు. సినిమా మొదట్లో ఉన్న అనుభూతి తర్వాత ఉండదు. గ్రామస్థులు ఇంగ్లీషులో మాట్లాడినప్పుడు సుందరం షాక్ కావడం, ఆ తర్వాత ఎపిసోడ్లు కొన్ని ఆకట్టుకుంటాయి. గ్రామ దేవత విగ్రహం కోసం వెతుకుతున్న సమయంలో వచ్చే ఇంటర్వెల్ ఎపిసోడ్ కూడా ఉత్కంఠగా ఉంది. సుందరం మాస్టర్ పోరాటం ఎక్కువగా సాగదీసిన ఫీలింగ్ కలిగేలా చేసింది.
ఎవరెలా చేశారంటే?
సుందరం మాస్టర్ అనే పాత్రలో హర్ష చెముడు జీవించేశాడు. సినిమాలో కూడా కామెడీని పండించాడు. బాలకృష్ణ, దివ్యశ్రీ పాద, హర్షవర్ధన్, భద్రం వంటి వాళ్ళు తమ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకునేలా నటించారు. గూడెం ప్రజలుగా నటించిన వారు బహుశా అక్కడివారు ఏమో తెలియదు కానీ వారంతా చాలా న్యాచురల్ గా అడవి బిడ్డలలానే కనిపించారు.
సాంకేతిక అంశాలు
టెక్నికల్ విషయానికొస్తే దర్శకుడి స్టోరీ తీసుకునే లైన్ బాగుంది. కానీ దాన్ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేదనిపిస్తుంది. కొన్ని డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉంటాయి. అడవి అందాలను చక్కగా చూపించాడు. సినిమాటోగ్రాఫర్ ఈ విషయంలో సక్సెస్ అయ్యాడు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటలు పెద్దగా గుర్తుండిపోయేలా లేవు. ఎడిటింగ్ కూడా బాగుంది.