»Sabari Movie Review How Is Sabari Movie Starring Varalakshmi Sarath Kumar
Sabari Movie Review: వరలక్ష్మీ శరత్ కుమార్ నటించిన శబరి సినిమా ఎలా ఉందంటే?
వరలక్ష్మి శరత్ కుమార్ స్టార్ కిడ్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. లేడీ విలన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. హనుమాన్తో అందరిని అలరించిన ఆమె ఇప్పుడు ముఖ్య పాత్ర్రలో నటించిన శబరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథ
సంజన(వరలక్ష్మీ శరత్ కుమార్) ఒక ఒంటరి మహిళ. తన చిన్నతనంలో తల్లి ప్రేమకు నోచుకోదు. తర్వాత ప్రేమించి అరవింద్(గణేశ్ వెంకట్రామన్)ను వివాహం చేసుకుంటుంది. వీళ్లకి ఒక పాప కూడా ఉంది. సంజనను అరవింద్ మోసం చేయడంతో తన కూతురు రియా(నివేక్ష)ను తీసుకుని ముంబాయి నుంచి వైజాగ్ వెళ్లిపోతుంది. తన కాలేజీ మిత్రుడు, న్యాయవాది అయిన రాహుల్(శశాంక్)ను కలుస్తుంది. అతని సాయంతో ఓ కంపెనీలో జుంబా ట్రైనర్‌గా ఉద్యోగం చేస్తుంది. ఆ తర్వాత వైజాగ్‌లో ఓ ఇంట్లో అద్దెకు వెళ్తుంది. అంతా మంచిగా సాగుతుందనుకుంటే.. సంజనకు ఓ సమస్య ఎదురవుతుంది. సైకో అయిన సూర్యం(మైమ్ గోపి) అనే వ్యక్తి సంజన బిడ్డ రియాను అప్పగించమంటాడు. లేకపోతే తన కూతుర్ని చంపేస్తానని బెదిరిస్తాడు. అలాగే అరవింద్ కూడా తన కూతుర్ని అప్పగించమని కోర్టును ఆశ్రయిస్తాడు. అయితే తన కూతుర్ని కాపాడుకోవడానికి సంజన ఏం చేసింది? రియా నిజంగా తన కూతురా? కాదా? సైకో సూర్యం నుంచి ఎలా తప్పించుకుంటుంది? అతనికి అరవింద్‌కు ఏదైనా సంబంధం ఉందా? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
తన కూతుర్ని కాపాడుకోవడం కోసం ఓ తల్లి చేసిన సాహసాలు కనిపిస్తాయి. దర్శకుడు వీటిని ఓ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా చూపించే ప్రయత్నం చేశాడు. అయితే కథలో కొన్ని ట్విస్ట్‌లు థ్రిల్లింగ్‌గా ఉన్నా.. అంతగా మెప్పించవు. ఎందుకంటే స్క్రిప్ట్‌లో సరైన బలం లేకపోవడం. సినిమాను దర్శకుడు పాత్రల పరిచయంతో మొదలు పెట్టాడు. సంజన చిన్నతనంలో తల్లి ప్రేమ దూరం కావడం, అరవింద్‌ను ప్రేమించి పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత అతని చేతిలో మోసపోయి వైజాగ్ వెళ్లిపోవడం అన్ని కొంచెం బోరింగ్‌గా అనిపిస్తుంది. అరవింద్ తన కూతుర్ని అప్పగించాలని కోర్టును ఆశ్రయించడంతో కథలో వేగం పెరుగుతుంది. రియాను అప్పగించాలని సంజనను సూర్యం వెంటాడుతాడు. అతని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆమెకు ఎదురయ్యే పరిస్థితులు ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేస్తాయి. మొదట్లో భయపెట్టిన సూర్యం పాత్రం చివరికి అంతగా ఉండదు. రియా కిడ్నాప్ చుట్టూ నడిపించిన సన్నివేశాలు ఏమాత్రం ఆసక్తి ఉండదు. ముగింపు అసలు సినిమాకి మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా సినిమాకి అసలు శబరి అని పేరు ఎందుకు పెట్టారో అర్థం కాదు. ఇలా సినిమాలో చాలా లాజిక్ లెస్ సన్నివేశాలు ఉంటాయి.
ఎవరెలా చేశారంటే?
సంజనా పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ తన సహజమైన నటనతో ఆకట్టుకుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన నటనతో మార్కులు కొట్టేసింది. ఆమె నటన సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. సైకో సూర్యం పాత్రలో మైమ్ గోపి నటన ఆకట్టుకుంటుంది. మిగతా పాత్రలన్నీ వాళ్ల పరిధి మేరకు బాగానే నటించారు. కథలో కొత్తదనం ఉంది. కానీ దర్శకుడు దానిని తెరపై చూపించడంలో విఫలమయ్యాడు. స్క్రీన్‌ప్లేకి ఇంకా పదును పెట్టి ఉంటే బాగుండేది.
సాంకేతిక అంశాలు
టెక్నికల్ విషయానికొస్తే గోపి సుందర్ మ్యూజిక్, బీజీఎం బాగుంది. ఈ థ్రిల్లింగ్ సినిమాకు గోపి సుందర్ మ్యూజిక్ బాగా సెట్ అయ్యింది. విజువల్స్, ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. కథకు తగ్గట్లు నిర్మాణ విలువలున్నాయి.
ప్లస్ పాయింట్స్
+వరలక్ష్మీ శరత్ కుమార్ నటన
+కథలోని కొన్ని సన్నివేశాల ట్విస్ట్‌లు
మైనస్ పాయింట్స్
-కథ, స్క్రీన్‌ప్లే
-స్లోగా సాగే కొన్ని సన్నివేశాలు
-ఆకట్టుకోని ముగింపు