»Premam Director Quits Film Career Due To Health Reasons
Premam director: సినిమాల నుంచి తప్పుకున్న హిట్ మూవీ డైరెక్టర్..?
మళయాళ సూపర్ హిట్ సినిమాల్లో ప్రేమమ్ ఒకటి. ఈ మూవీ అక్కడ కాసుల వర్షం కురిపించింది. అక్కడ సూపర్ హిట్ కావడంతో, తెలుగులోనూ ఇదే పేరుతో రీమేక్ చేశారు. ఇక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది. కాగా, మళయాళ ప్రేమమ్ డైరెక్టర్ అల్ఫోన్స్ పుత్రేన్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు.
‘ప్రేమమ్’ డైరెక్టర్ అల్ఫోన్స్ పుత్రేన్ సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు. అనారోగ్య కారణాలతో సినిమా కెరీర్‌ను విడిచిపెట్టినట్లు ఆయన ప్రకటించారు. తన అభిమానులను నిరుత్సాహపరుస్తూ తన సినిమా, థియేటర్ కెరీర్‌ను ముగించుకుంటున్నట్లు ప్రకటించాడు. తనకు ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ఉందని తెలుసుకున్నానని అన్నారు. తన బాధను వ్యక్తం చేస్తూ అల్ఫోన్స్ సోషల్ మీడియాలో ఓ నోట్‌ను షేర్ చేశారు.
“నేను నా సినిమా, థియేటర్ కెరీర్‌ను ముగించుకుంటున్నాను. నేను ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్‌తో బాధపడుతున్నాను. షార్ట్ ఫిల్మ్స్, వీడియోస్, సాంగ్స్ చేస్తూనే ఉంటాను. కొన్నిసార్లు OTT మూవీస్ కూడా చేస్తాను. సినిమా నుండి వైదొలగడం ఊహించలేను. కానీ నాకు వేరే మార్గం లేదు. నేను నిలబెట్టుకోలేని వాగ్దానాన్ని చేయడం నాకు ఇష్టం లేదు. ఆరోగ్యం బలహీనంగా ఉంది. జీవితం ఇంటర్వెల్ పంచ్ లాంటి ట్విస్ట్ ఇచ్చింది.’’ అంటూ సోషల్ మీడియాలో చెప్పుకొచ్చాడు.
అల్ఫోన్స్ పోస్ట్‌పై అభిమానులతో సహా చాలా మంది స్పందిస్తున్నారు. మరికొందరు అభిమానులు అల్ఫోన్స్‌కు స్వయంగా నిర్ణయం తీసుకోకుండా, డాక్టర్ సహాయంతో ఖచ్చితమైన రిపోర్ట్ తీసుకోవాలని సూచించారు. 2013లో ‘నేరం’ సినిమాతో దర్శకుడిగా మలయాళ చిత్రసీమలోకి అడుగుపెట్టాడు.
2015లో ‘నేరమ్’ విజయం తర్వాత, అల్ఫోన్స్ మళ్లీ నివిన్ పౌలీతో ‘ప్రేమమ్’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం మలయాళంలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ప్రేమమ్‌తో దర్శకుడు అల్ఫోన్స్ పుత్రన్ అన్ని చోట్లా మంచి క్రేజ్‌ను పొందారు. ఇటీవల పృథ్వీరాజ్ సుకుమారన్, నయనతార నటించిన గోల్డ్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. ప్రేమమ్ దర్శకుడు అనారోగ్య కారణాలతో తన సినీ కెరీర్‌కు స్వస్తి చెప్పాడనే వార్తతో అభిమానులు ప్రస్తుతం షాక్ అవుతున్నారు.