రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ఖుషి. ఎట్టి పరిస్థితుల్లోను ఈ సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు విజయ్. అలాగే శాకుంతలంతో ఫ్లాప్ అందుకున్న సమంత కూడా భారీ ఆశలే పెట్టుకుంది. డైరెక్టర్ శివ నిర్వాణ కూడా ఖుషితో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. తాజాగా ఈ సినిమా సెన్సార్ రిపోర్ట్ బయటకొచ్చేసింది.
లైగర్ వంటి ఫ్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత హీరోయిన్గా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ క్రమంలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది ఖుషి. సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు యూఏ సర్టిఫికెట్ జారీ చేశారు. రన్ టైం వచ్చేసి 165 నిమిషాలు లాక్ చేసినట్టు తెలుస్తోంది. అంటే.. రెండు గంటల 45 నిమిషాలు.. మూడు గంటలకు ఒక్క పావుగంట తక్కువ అన్నమాట. అయితే ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌కు ఈ రన్ టైం కాస్త ఎక్కువనే చెప్పాలి. కానీ ఆడియెన్స్ కంటెంట్‌కు కనెక్ట్ అయితే.. ఇదేం ఎక్కువ లెంగ్త్ కాదని చెప్పొచ్చు.
అందుకే ‘ఖుషి’ చిత్ర యూనిట్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. ఇక సెన్సార్ టాక్ కూడా బాగుందని తెలుస్తోంది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారట. ఖచ్చితంగా ఖుషి సినిమా విజయ్ దేవరకొండకు సాలిడ్ కంబ్యాక్ అవుతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ అదిరిపోయాయి. హేషం అబ్దుల్ వాహబ్ అందించిన ట్యూన్స్ సూపర్ హిట్ అయ్యాయి.
ఇటీవల జరిగిన మ్యూజిక్ కన్సర్ట్ కూడా హిట్ అవడంతో.. సినిమాపై కావాల్సినంత బజ్ ఏర్పడింది. ఈ ఈవెంట్లో సమంత, విజయ్ దేవరకొండ డ్యాన్స్ హైలెట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా రిజల్ట్ విజయ్ దేవరకొండ, సమంతతో పాటు డైరెక్టర్ శివ నిర్వాణకు కూడా కీలకంగా మారింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాను.. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఖుషి ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.