దేశవ్యాప్తంగా సంచలనంగా నిలిచింది కన్నడ చిత్రం ‘కాంతార'(Kantara). హీరోగా, దర్శకుడిగా రిషబ్ శెట్టి తెరకెక్కించిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టింది. ఇప్పటికే కన్నడలో 100 కోట్లకు పైగా రాబట్టగా.. తెలుగులో 22 కోట్లకు మించి వసూళ్లని రాబట్టింది. ‘కేజీఎఫ్’ మేకర్స్ హోంబలే ఫిలింస్ నిర్మించిన ఈ సినిమాను.. తెలుగులో స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల చేశారు. దాంతో ఈ నిర్మాణ సంస్థపై కాసుల వర్షం కురిపిస్తోంది కాంతార.
ఇక ఈ సినిమా క్లైమాక్స్ గూస్ బంప్స్ వచ్చేలా ఉండడంతో.. ఎక్కడ చూసిన దాని గురించే చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో అనుసరించే.. ప్రాచీన భూత కోల అనే ఆచారాన్ని ఇందులో చూపించారు. ఇదే సినిమాలో హైలెట్గా నిలిచింది. దాంతో సినిమా చూసిన తర్వాత.. ఆ ఇంపాక్ట్ నుంచి బటయకు రాలేకపోతున్నారు జనాలు. అందుకే సినిమాలో హీరో చేసే ‘ఓ’ అనే శబ్దాన్ని అనుకరిస్తున్నారు. దీనిపై కాంతార హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి స్పందించినట్టు తెలుస్తోంది.
‘ఓ’ అనే అరుపు ఒక ఆచారం, సంప్రదాయానికి సంబంధించినదని, దాన్ని ఎవరూ బయట అలా చేయకూడదని రిక్వెస్ట్ చేశారు. అలాగే ‘ఓ’ అనేది కేవలం శబ్దం మాత్రమే కాదని.. అది తమకు సెంటిమెంట్ అని తెలిపాడు. అంతేకాదు ఇది చాలా సున్నితమైన అంశం.. దాన్ని అనుకరించడం వల్ల ఆచారం దెబ్బతినే అవకాశం వుంది’ అంటూ ప్రేక్షకుల్ని రిక్వెస్ట్ చేసినట్టు సమాచారం. ఏదేమైనా కాంతార ఓ సంచలనం అని చెప్పొచ్చు.