»Kalki 2898 Kalki 2898 Is A Big Release On June 7 Worldwide
Kalki 2898: ప్రపంచవ్యాప్తంగా జూన్ 7న కల్కి 2898 భారీ విడుదల
ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న కల్కి సినిమా రిలీజ్ డేట్ ఛేంజ్ అవుతూనే ఉంది. అయితే ఈ సినిమా జూన్ 7న విడుదల అయ్యే అవకాశం ఉందని కల్కి చిత్రం నిర్మాత అశ్వనీదత్ హిట్ టీవీతో తెలిపారు.
Kalki 2898: భారీ చిత్రాలు నిర్మించడం ఒకెత్తైతే, వాటిని సక్సెస్‌ఫుల్‌గా రిలీజ్ చేయడం ఒక ఎత్తు. ఉదాహరణకి కల్కి 2898 చిత్రం. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా కనిపించనున్నారు. అలాగే ప్రముఖ నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే కూడా నటిస్తున్నారు. ఈ సినిమాకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా.. అగ్రనిర్మాత అశ్వనీదత్ చలసాని నిర్మిస్తున్నారు. అయితే కల్కి చిత్రాన్ని విడుదల చేయడానికి సరైన డేట్ నిర్ణయించడంలో మల్లగుల్లాలు పడుతున్నారు. మొట్టమొదట జగదేకవీరుడు అతిలోకసుందరి విడుదలైన మే 9న కల్కి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఏపిలో ఎలక్షన్ ఫీవర్ తారాస్థాయికి చేరుకున్న తర్వాత, ఆ గందరగోళంలో సినిమాకి న్యాయం జరగదనే ఆలోచనతో మళ్లీ మరో డేట్ కోసం గాలించారు.
ఎన్నికలు అయిన తర్వాత ప్రశాంతంగా సినిమా విడుదల చేస్తే బాగుంటుందనే దృక్ఫథంతో మే 9 నుంచి రిలీజ్ డేట్ మే 30కి మార్చారు. కానీ ఈ డేట్ కూడా కాదని తెలిసింది. ఎందుకంటే అప్పటికి ఇంకా గ్రాఫిక్స్ పూర్తి కావు. అసలు కల్కి సినిమాకి గ్రాఫిక్సే ప్రాణం. అలాంటిది గ్రాఫిక్స్ లేకపోతే కష్టం. మొత్తం సైన్స్, ఫిక్షన్, మైథాలజీ అన్నీ కలిపి కల్కి సినిమా తెరకెక్కుతోంది. భూతభవిష్యత్ వర్తమాన కాలాలను ఓ మూడు గంటల వ్యవధిలోకి ఇమిడ్చి రూపొందించిన ఈ ఫాంటసీ ఫిల్మ్‌లో గ్రాఫిక్స్ పాత్ర బృహత్తరమైనది. నాగ అశ్విన్ ఎంతో శ్రమపడి రూపొందించిన ఈ అపురూపమైన కథని మాస్ క్లాస్ ఆడియన్స్ ఎంజాయ్ చేసే రేంజ్లో తెరకెక్కించాలంటే గ్రాఫిక్స్ మెయిన్ రోల్‌ని పోషించాయి. అందుకే డేట్ మళ్లీ మార్చారు. ఈ విషయంపై చిత్రనిర్మాత అశ్వనీదత్ హిట్ టీవి వెబ్ సైట్‌తో మాట్లాడుతూ.. గ్రాఫిక్స్ కారణంగానే సినిమా మరోవారం వాయిదా పడుతుందని చెప్పారు.
మిగిలిన వర్క్ అంతా పరిపూర్ణంగా పూర్తయిందనీ, అందుకే తదుపరి వారం అంటే.. జూన్ 7వ తేదీన సినిమాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని తెలియజేశారు. కల్కి సినిమాకి ఏపీ రాజకీయాలు కూడా ఒక రకంగా పెద్ద ఛాలెంజ్‌నే విసురుతున్నాయి. ఎందుకంటే వైసీపీ పార్టీ ఎన్నికలలో విజయభేరి మోగించిందా అంటే కల్కి లాంటి భారీ సినిమాలకి గడ్డు పరిస్థితే ఎదురుకానున్నది. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం టిక్కెట్ల ధర పెంపుకి ఎప్పుడూ సుముఖతను వ్యక్తం చేయలేదు.
టీడీపీ ఎమ్మేల్యే, ప్రముఖ కథానాయకుడు బాలకృష్ణ నటించిన బోయపాటి సినిమా అఖండ నార్మల్ టికెట్ రేట్స్‌తోనే విడుదలైంది. అయితే అఖండ తక్కువ రేట్లతోనే విజయం సాధించి సంచలనం సృష్టించింది. భీమ్లా నాయక్‌కి కూడా అదే పరిస్థితి. కాకపోతే, ఇప్పుడు టీడీపీ కూటమికి అనుకూల పవనాలు వీస్తున్నాయని అందరూ భావిస్తున్న సమయంలో ఒకవేళ టీడీపీ కూటమే అధికారంలోకి వస్తే పెద్ద సినిమాల పంట పండినట్టే. కాకపోతే ఒక్క ఏపీ మార్కెట్ ఒక్కటే ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే ఇలాంటి చిత్రాలను పెద్దగా ప్రభావితం చేయలేదనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది.