కల్కీ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. కాసుల వర్షం కురిపిస్తున్నారు. విడుదలైన అన్ని చోట్లా హిట్ టాక్ తెచ్చుకోవడంతో ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు పెడుతున్నారు. దీంతో సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే 555 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
కల్కీ సినిమా ప్రేక్షకులను కట్టి పడేస్తోంది. దర్శకుడు నాగ్ అశ్విన్ సినిమాను తీర్చిదిద్దిన విధానం థియేటర్లో కూర్చున్న ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని అందిస్తోంది. వారే వాహ్ అనేట్లు చేస్తోంది. దీంతో కలెక్షన్లు ఊహించిన స్థాయికన్నా అధికంగానే వస్తున్నాయి. విడుదలైన నాటి నుంచి ఇప్పటి వరకు నాలుగు రోజుల్లో మొత్తం 555 కోట్లు వసూలైనట్లు సినిమా నిర్మాతలు వెల్లడించారు. ఈ విషయాలను తెలియజేస్తూ ఓ ట్వీట్ చేశారు.
ప్రభాస్‌తో పాటు దీపికా పదుకోనె, అమితాబ్, కమల్ హాసన్ వంటి స్టార్లు నటించిన కల్కీ సినిమాను తెలుగుతో సహా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేశారు. విడుదలైన అన్ని చోట్లా మంచి టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా అమితాబ్ చేసిన అశ్వథామ క్యారెక్టర్ అద్భుతంగా రావడంతో హిందీ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. కల్కీ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో హిందీ బెల్ట్‌లో కూడా కల్కీ కలెక్షన్లు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ విషయాన్ని ప్రముఖ సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. కల్కీ సినిమా విడుదలైన తొలి రోజున 22.50 కోట్లు వసూలు చేయగా రెండో రోజున 23.25 కోట్లు వసూలు చేసింది. ఇక శని, ఆదివారాల్లో కలెక్షన్లు కుమ్మేశాయి. శనివారం రోజున 26.25 కోట్లు వసూలు చేయగా.. ఆదివారం మాత్రం కల్కీ కలెక్షన్లు అదరహో అనిపించాయి. హిందీ ప్రాంతాలలో ఏకంగా 40.15 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మొత్తంగా మొదటి నాలుగు రోజుల్లో ఏకంగా 112. 15 కోట్లు వసూలు చేసినట్లు తెలిసింది.
కల్కీ సినిమాకు మౌత్ పబ్లిసిటీ చాలా బాగా పనిచేస్తోందని తెలిపాడు తరణ్ ఆదర్శ్. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అనే తేడాలు లేకుండా అన్ని చోట్లా కల్కీ కలెక్షన్ల వర్షం కురుస్తోందని తరణ్ ఆదర్ష్ తన ట్వీట్లో వివరించాడు. కంటెంట్ కింగ్ అయితే… ప్రేక్షకులు కింగ్ మేకర్స్ అని తరణ్ ఆదర్శ్ అభిప్రాయపడ్డాడు. కల్కీ సినిమాకు వస్తున్న పాజిటివ్ టాక్ కారణంగా పనిదినాల్లో కూడా కల్కీ సినిమాకు కలెక్షన్లు అధికంగా ఉంటాయని తరణ్ ఆదర్ష్ తెలిపాడు. కల్కీ మొదటి పార్ట్‌లో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన నాగ్ అశ్విన్..రెండో పార్ట్ కూడా త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండో పార్ట్ షూటింగ్ 50 శాతానికి పైగా పూర్తయినట్లు తెలుస్తోంది. మరో పది రోజుల్లో రెండో పార్ట్ మిగతా పార్ట్ షూటింగ్ ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా కల్కీ పార్ట్ 2 ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సెకండ్ పార్ట్.. మొదటి పార్ట్ కంటే ఎంతో అద్భుతంగా ఉండే అవకాశం ఉందని సినీ ప్రముఖులు అంచనా వేస్తున్నారు.