Prabhas: గ్లోబల్ స్టార్‌గా మారిన డార్లింగ్ ప్రభాస్‌కి హ్యాపీ బర్త్ డే..!
ఒక హీరో అంటే అందగాడై ఉండాలి. ఎలాంటి పాత్రలో అయినా నటించగలిగేలా ఉండాలి. ఎదుట ఎంత పెద్ద విలన్ ఉన్నా, తన ఆహార్యంతో భయపెట్టేలా ఉండాలి. అమ్మాయిల గుండెలు కొల్లగొట్టాలి. ఇలాంటి లక్షణాలు అన్నీ కలిపితే మన ప్రభాస్ అవుతాడు.
ప్రభాస్ లాంటి ఆరుడగుల అందగాడికి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. అందుకే అప్పటి వరకు తెలుగు ప్రేక్షకుల మనసులు మాత్రమే గెలుచుకున్న ఆయన, బాహుబలితో దేశ వ్యాప్తంగా అందరి ఫేవరేట్ హీరో అయిపోయాడు. చాలా మంది హీరోయిన్ల సెలబ్రిటీ క్రష్ గా కూడా మారిపోయాడు. హిందీ హార్ట్ ల్యాండ్‌లో బాలీవుడ్ సూపర్స్టార్లతో సమానమైన స్టార్‌డమ్‌ను అనుభవిస్తున్నాడు. నార్త్‌లో ఇంతకు ముందు ఏ తెలుగు హీరోకి ఈ అవకాశం లేదు.
ఈశ్వర్ నుండి బాహుబలి వరకు గ్లోరియస్ జర్నీ:
ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ తెరంగేట్రం చేశాడు. వారసత్వం అరంగేట్రం వరకు మాత్రమే సహాయపడుతుందని ప్రభాస్ నిరూపించాడు. ఆ తరువాత నైపుణ్యాలు, ప్రతిభ నిజంగా ముఖ్యమైంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా ఈశ్వర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్.. పాత్రల పరిధి మేరకు తన నటనా ప్రతిభను చాటుకున్నాడు. వర్షం ప్రభాస్ మొదటి భారీ కమర్షియల్ బ్లాక్ బస్టర్ అయితే, భారతదేశం గర్వించదగ్గ SS రాజమౌళి దర్శకత్వం వహించిన ఛత్రపతి అతన్ని తిరుగులేని స్టార్ హీరోగా మార్చింది. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ కి కాస్త దగ్గరయ్యాడు ప్రభాస్.
‘రాఘవేంద్ర,’ ‘అడవి రాముడు,’ ‘చక్రం,’ ‘పౌర్ణమి,’ ‘యోగి,’ ‘మున్నా,’ ‘బుజ్జిగాడు,’ ‘బిల్లా,’ ‘ఏక్ నిరంజన్,’ ‘రెబల్’ వంటి సినిమాలన్నీ ప్రభాస్ ఫ్లెక్సిబిలిటీని ప్రదర్శించాయి. మిర్చి అతని కెరీర్లో ఒక రకమైన సూపర్ హిట్. బాహుబలి చిత్రాల అపూర్వ విజయంతో ప్రభాస్ ప్యాన్-ఇండియా సంచలనంగా మారాడు. తెలుగు రాష్ట్రాల బాక్సాఫీస్ వ్యాపారాన్ని జాతీయ స్థాయికి పెంచిన ఘనత కూడా ప్రభాస్‌కే దక్కుతుంది. ఇప్పటి వరకు ఏ తెలుగు హీరో బ్రేక్ చేయని రికార్డులను ప్రభాస్ బద్దలు కొట్టాడు. తెలుగు సినిమా 2000 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందని బాహుబలి 2తో ప్రభాస్ చూపించాడు. ఓవర్సీస్లో 10 మిలియన్ డాలర్లు వసూలు చేసిన తొలి హీరో ప్రభాస్.
గ్లోబల్ స్టార్‌గా వెలుగొందుతున్న ప్రభాస్:
ప్రభాస్‌కు భారతదేశంలోనే కాకుండా జపాన్, చైనా, మలేషియా, సింగపూర్ , యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాలలో కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. 2017లో బ్యాంకాక్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో ప్రభాస్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ మ్యూజియంలో మైనపు బొమ్మను ఉంచిన తొలి సౌత్ ఇండియన్ సెలబ్రిటీ ప్రభాస్ కావడం విశేషం.
ప్రభాస్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్:
ప్రభాస్ రాబోయే ఫిల్మోగ్రఫీని చూస్తుంటే, అతను భారతీయ సినిమాని జయించటానికి సిద్ధంగా ఉన్నాడని ఊహించడం సులభం. సలార్ పార్ట్ 1: ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించి, హోంబలే ఫిలిమ్స్ నిర్మించారు. డిసెంబర్ 22న విడుదల కానుంది. ఈ చిత్రం కోసం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మించిన పాన్-గ్లోబల్ ప్రాజెక్ట్ కల్కి 2898AD సినిమా 2024లో విడుదల కానుంది. దర్శకుడు నాగ్ అశ్విన్ అత్యాధునిక సాంకేతికతతో, భారీ బడ్జెట్‌తో కల్కి 2898 ADని నిర్మిస్తున్నారు. ఈ మూవీ నిస్సందేహంగా చరిత్ర సృష్టిస్తుంది. శాన్ డియాగో కామిక్-కాన్ సందర్భంగా విడుదలైన కల్కి 2898 AD గ్లింప్స్ రికార్డు స్థాయిలో వీక్షణలను అందుకుంది. మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉండబోతోంది. విభిన్నమైన శైలిని ఎంచుకున్న ప్రభాస్ వింటేజ్ లుక్ లో కనిపించనున్నాడు. సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కబోయే ‘స్పిరిట్’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాలన్నీ విభిన్నమైన జోనర్లలో రూపొందుతున్నాయి. ప్రతి దానిలో ప్రభాస్ విభిన్నమైన లుక్‌లలో కనిపించనున్నాడు.