Extraordinary Man Movie review: ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ కామెడీ పండిందా?
హీరో నితిన్, శ్రీలీల జంటగా నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వక్కంతం వంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.
హీరో నితిన్ సినిమా హిట్ అయ్యి చాలా ఏళ్లు అవుతుంది. భీష్మ సినిమా తర్వాత సరైన హిట్ పడలేదు. ఎన్నో అంచనాలతో ముందుకు వచ్చిన రంగ్ దే, మాచర్ల నియోజకవర్గం కూడా ఉహించినంత ఫలితాలను ఇవ్వలేదు. ఈసారైన హిట్ కొట్టాలని కామెడీ ఎంటర్టైనర్లో ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్‌తో ముందుకు వచ్చాడు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరి ఈ రోజు థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో చూద్దాం పదండి.
చిత్రం:ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ నటీనటులు:నితిన్, శ్రీలీల, రాజశేఖర్, సుదేవ్ నాయర్, రావు రమేష్, రోహిణి, సంపత్ రాజ్, బ్రహ్మాజీ, హైపర్ ఆది, తదితరులు సంగీతం:హారీశ్ జయరాజ్ సినిమాటోగ్రఫీ:ఆర్థర్ విల్సన్, యువరాజ్, సాయి శ్రీరామ్ ఎడిటర్: ప్రవీణ్ పూడి నిర్మాణ సంస్థ: శ్రేష్ఠ మూవీస్ దర్శకత్వం: వక్కంతం వంశీ నిర్మాత:నికితా రెడ్డి, సుధాకర్ రెడ్డి విడుదల తేదీ:08/12/2023
కథ
అభి(నితిన్)కు చిన్నప్పటి నుంచి మరో వ్యక్తిలా ఉండటమంటే చాలా ఇష్టం. అలా జూనియర్ ఆర్టిస్ట్‌గా మారుతాడు. టాలెంట్ ఉన్నా ఇండస్ట్రీలో మాత్రం తనకు గుర్తింపు రాదు. కెమెరా లెన్స్‌కు కనిపించకుండా దూరంగా ఉండేటట్లు అభిని ఉంచుతారు. అదే సమయంలో లిఖిత(శ్రీలీల) పరిచయం అవుతుంది. ఆమె ఓ పెద్ద కంపెనీకి సీఈఓ. లిఖితతో ప్రేమలో పడిన తర్వాత అభి జీవితం మారిపోతుంది. అదే కంపెనీలో సీఈఓ స్థాయికి చేరుకుంటాడు. ఆ సమయంలో అభికి హీరోగా నటించే అవకాశం వస్తుంది. మొదట సినిమా చేయకూడదని అభి అనుకున్న తర్వాత.. స్టోరీ నచ్చడంతో సినిమా చేయడానికి ఒకే చెప్తాడు. ఈ సినిమాలో హీరోగా నటించడం కోసం ఉద్యోగాన్ని, ప్రేమించిన అమ్మాయిని వదులుకుంటాడు. కానీ తర్వాత ఈ సినిమాలో అభిని హీరోగా కాకుండా వేరే హీరోతో చేయించాలని నిర్ణయించుకుంటారు. ఈ షుటింగ్ కోటియా అనే గ్రామంలో జరుగుతుంది. అదే సమయంలో అభికి ఇబ్బందులు ఎదురవుతాయి. దొంగ పోలీసుగా కోటియా గ్రామంలో అడుగుపెడతాడు. అభి నిజమైన పోలీస్ కాదని తెలుసుకున్న ఐజీ విజయ్ చక్రవర్తి(రాజశేఖర్) ఏం చేశాడు? జూనియర్ ఆర్టిస్ట్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్‌గా ఎలా పేరు తెచ్చుకున్నాడనేది స్టోరీ.
ఎలా ఉందంటే?
కామన్ స్టోరీ అయినా కూడా కొన్ని సన్నివేశాల్లో అదిరిపోయే ట్విస్ట్‌లు ఉన్నాయి. ప్రేక్షకులను నవ్వించడమే ఈ సినిమా. అందుకే లాజిక్స్ లేకుండా కామెడీ ఉంటుంది. సినిమా కామెడీగా ఉన్నప్పటికీ కథ సహజంగా లేదు. ఓ స్మగ్లర్‌కు హీరో కథ చెప్పడంతో ప్రారంభమయిన కథ.. జూనియర్ ఆర్టిస్ట్‌గా ఇబ్బందులు, ఇంట్లో తండ్రితో తిట్లు అన్ని సరదాగానే ఉంటాయి. ఇందులో శ్రీలీల పాత్ర అంతంత మాత్రమే. ఫస్టాఫ్‌లో కామెడీ టైమింగ్ బాగుంది. లిఖిత అభి వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడు స్ఫూఫ్ పాటలతో చేసిన కామెడీ బాగుంది. బాలకృష్ణ చెంప దెబ్బల అంశం, విజయ్-రష్మికల లవ్ టాపిక్, నరేశ్-పవిత్రా లోకేష్‌ల ప్రేమ వంటి ట్రెండింగ్ టాపిక్స్ ఉంటాయి. ఇంటర్వెల్ సీన్ వల్ల సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచాయి. కానీ సెకండాఫ్‌లో కామెడీ పండలేదు. హీరో దొంగ పోలీస్‌గా కోటియా గ్రామంలోకి వెళ్తాడు. ద్వితీయార్థంలో స్క్రీన్ ప్లే మార్చి సినిమా తీసి ఉంటే బాగుండేది. క్యారెక్టర్లను డిజైన్ చేసుకున్న విధానం బాగుంది. కానీ ఎగ్జిక్యూట్ చేసే విధానంలో మాత్రం క్యారెక్టర్‌ను ఫుల్ ఫ్లెడ్జ్‌గా వాడుకోలేదు. రాజశేఖర్ పరిచయ సన్నివేశాలు, ఆయనకు నితిన్‌కు మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.
ఎవరెలా చేశారంటే?
జూనియర్ ఆర్టిస్ట్‌గా అభిగా నితిన్ పాత్రకు తగ్గట్టు నటించారు. తనదైన శైలిలో కామెడీ పండించారు. విభిన్నమైన లుక్స్‌తో ఆకట్టుకున్నారు. లిఖిత పాత్రలో శ్రీలీల అందంగా కనిపించింది. కానీ ఆమె పాత్రకు అంత ప్రాధాన్యత లేదు. రాజశేఖర్ పాత్ర కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరో తండ్రిగా రావు రమేష్ కామెడీ టైమింగ్ బాగుంది. డైరక్టర్ కామెడీపై పెట్టినంత శ్రద్ధ కథపై పెట్టలేదు. సినిమా ప్రారంభంలో ఉన్న స్టోరీకి ఎండ్ స్టోరీకి సంబంధం లేదు. దర్శకుడు స్క్రిఫ్ట్‌పై మరింత దృష్టి పెట్టి ఉంటే బాగుండేది.
సాంకేతిక అంశాలు
హరీశ్ జైరాజ్ పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా ఒకే అన్నట్టుగానే ఉంది. సినిమాటోగ్రాఫర్ ఆర్థర్ విల్సన్ అందించిన విజువల్స్ చాలా బాగున్నాయి. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్‌గానే ఉన్నాయి. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాగుంది. కానీ కొన్ని కామెడీ సన్నివేశాలు లాగైనట్టుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
+నితిన్ నటన
+ కామెడీ
మైనస్ పాయింట్స్
-స్క్రీన్ ప్లే
-మ్యూజిక్
-కొన్ని సన్నివేశాల్లో డైరక్షన్
-సెకాండాఫ్ సాగదీత