తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను, మోగాస్టార్ చిరంజీవి ఆస్పత్రిలో కలిసి పరామర్శించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు. కేసీఆర్ సినిమా పరిశ్రమ బాగోగుల గురించి అడిగినట్లు చిరంజీవి మీడియాతో తెలిపారు.
Chiranjeevi: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్(KCR)ను ఈ రోజు సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) యశోద ఆస్పత్రిలో పరామర్శించారు. ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కొద్ది రోజులు క్రితం కేసీఆర్ తన ఫామ్ హౌజ్లో ప్రమాదవశాత్తు కాలు జారిపడ్డ విషయం తెలిసిందే. రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు ఆయన్ను పరామర్శిస్తున్నారు. చిరంజీవి కూడా ఆస్పత్రికి వచ్చి కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కేసీఆర్(KCR) చాలా హుషారుగా మాట్లాడుతున్నారు. ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. శస్త్రచికిత్స తరువాత 24 గంటల్లో కేసీఆర్ నడిచేలా చేసిన వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు. మరో ఆరు వారాల్లో ఆరోగ్యం పూర్తిగా నయం అవుతుందని డాక్టర్లు తెలిపినట్లు వెల్లడించారు.
కేసీఆర్ తనతో సినిమా పరిశ్రమ గురించి అడిగినట్లు తెలిపారు. సినిమాలు ఆడుతున్నాయా, పరిశ్రమలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని పలు అంశాల గురించి ఆరా తీసినట్లు చిరంజీవి చెప్పారు. త్వరలోనే కేసీఆర్ పూర్తిగా కోలుకుంటారని అన్నారు. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth reddy), ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి మల్లు విక్రమార్క తదితరులు కలిశారు.