Manchu Vishnu: ‘భక్త కన్నప్ప’ అప్డేట్ వస్తోంది.. మంచు విష్ణు
ప్రస్తుతం టాలీవుడ్ హీరోలంతా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మంచు విష్ణు కూడా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈసారి ఎలాగైనా హిట్ అందుకోవాలని భారీ బడ్జెట్‌తో 'భక్త కన్నప్ప' సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా అప్డేట్ వస్తుందంటూ ట్వీట్ చేశాడు విష్ణు.
‘భక్త కన్నప్ప’ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో హీరోగా నటిస్తూ.. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు మంచు విష్ణు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా రేంజ్లో దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. మహేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ శివుడిగా కనపించనున్నాడు. పార్వతి పాత్రలో నయనతార పేరు వినిపిస్తోంది. అలాగే ఈ సినిమాలో మరో ఇద్దరు స్టార్ హీరోలు కనపించనున్నారు. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్‌తో పాటు.. కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ న్యూజిలాండ్‌లో జరుగుతోంది.
అక్కడే మేజర్ పార్ట్ షూటింగ్ చేయనున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి.. రిలీజ్ చేయడానికి పక్కా ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నాడు మంచు విష్ణు. ఈ క్రమంలో తాజాగా భక్త కన్నప్ప అప్డేట్ ఇచ్చాడు మంచు విష్ణు. నవంబర్ 23 తెల్లవారుజామున 2 గంటల 45 నిమిషాలకి భక్త కన్నప్ప అప్డేట్ వస్తుంది.. అంటూ మంచు విష్ణు ట్వీట్ చేసాడు. దీంతో విష్ణు ఎలాంటి అప్డేట్ ఇవ్వనున్నాడనేది ఆసక్తికరంగా మారింది.
ఇప్పటి వరకు భక్త కన్నప్ప టైటిల్ లోగో కూడా రిలీజ్ చేయలేదు. అలాగే ప్రభాస్, శివరాజ్ కుమార్, మోహన్ లాల్ నటిస్తున్నట్టుగా అనౌన్స్ చేయలేదు. దీంతో ఇందుకు సంబంధించిన అప్డేట్ ఇస్తాడా? లేక మరేదైనా షూటింగ్ అప్డేట్ ఇస్తాడా? అనేది తెలియాల్సి ఉంది. మరి మంచు విష్ణు ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.