భారత్, న్యూజిలాండ్ ల మధ్య తొలివన్డేకు రంగం సిద్ధమైంది. ఈ నెల 18వ తేదీ నుంచి హైదరాబాద్ వేదికగా.. ఈ వన్డే సిరీస్ జరగనుంది. కాగా… ఈ మ్యాచ్ టికెట్లను శుక్రవారం నుంచి ఆన్ లైన్ లో విక్రయించనున్నారు. గత సెప్టెంబరులో భారత్-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ టిక్కెట్ల విక్రయం సందర్భంగా జరిగిన అవాంఛనీయ సంఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్టు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ తెలిపారు. ప్రారంభ టిక్కెట్ ధర రూ.850 కాగా, గరిష్ఠ టిక్కెట్ ధరను రూ.20,650గా నిర్ణయించారు.
గత సెప్టెంబరులో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి కౌంటర్లలో టిక్కెట్లు విక్రయించడం లేదని.. కాంప్లిమెంటరీ పాసులు మినహా మిగిలిన టిక్కెట్లన్నీ ఆన్లైన్లో పేటీఎం ద్వారా అమ్మనున్నామని అజార్ చెప్పారు. స్టేడియం సీటింగ్ సామర్థ్యం 39 వేల 112 కాగా, అందులో 9,695 టిక్కెట్లు కాంప్లిమెంటరీ కోటాకు కేటాయించారు. మిగిలిన 29 వేల 417 టిక్కెట్లను అమ్మకానికి పెట్టనున్నారు. ఒక వ్యక్తి గరిష్ఠంగా నాలుగు టిక్కెట్లు మాత్రమే కొనుగోలు చేసే లా సాఫ్ట్వేర్ను రూపొందించారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి ఆన్ లైన్ లో టికెట్లు అందుబాటులో ఉంటాయి. 13వ తేదీన సా. 5 గం.కు ఆరు వేలు టిక్కెట్లు, 14వ తేదీ సా. 5 గం.కు ఏడు వేలు టిక్కెట్లు, 15వ తేదీ సా. 5 గం.కు ఏడు వేలు టిక్కెట్లు, మిగిలిన వాటిని 16వ తేదీ సా. 5 గం.కు అమ్మకానికి పెట్టనున్నారు.