»The Secret Hospitals Offering Criminals New Faces In Philippines
Philippines : అరెస్టుల నుంచి తప్పించుకోవడానికి క్రిమినెల్స్ ప్లాస్టిక్ సర్జరీలు!
ఫిలిప్పీన్స్‌లో నేరగాళ్లు సినీ ఫక్కీలో తప్పించుకుంటున్నారు. పోలీసుల కళ్లు కప్పేందుకు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుని ఏకంగా ముఖ కవళికలనే మార్చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన రహస్య ఆసుపత్రులను పోలీసులు ఇటీవల మూసివేయించారు. దీంతో ఈ విషయం ఇప్పుడు సంచలనంగా మారింది.
Philippines : పోలీసుల కళ్లు కప్పేందుకు కొందరు నేరగాళ్లు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటున్నారు. అరెస్టుల నుంచి తప్పించుకుంటున్నారు. మనం ఇప్పటి వరకు ఇలాంటి ఘటనల్ని సినిమాల్లోనే చూసుంటాం. ఇప్పుడు ఫిలిప్పీన్స్‌లో క్రిమినెల్స్(criminals) ఇదే పద్ధతిని ఫాలో అయిపోతున్నారు. భయంకరమైన నేరాలు చేసిన వారు ఆసుపత్రులకు వెళ్లి ముఖ కవళికలు మొత్తం మారిపోయేలా ప్లాస్టిక్ సర్జరీలు( plastic surgeries) చేయించేసుకుంటున్నారు. ఇందుకోసం అక్కడ రహస్యంగా కొన్ని ఆసుపత్రులు( Secret hospitals) కూడా వెలిశాయి. ఇవి వారి దగ్గర నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి ఈ రహస్య సర్వీసులను అందిస్తున్నాయి.
కొన్ని కుంభకోణాలకు పాల్పడిన వారు, దారుణమైన నేరాలకు పాల్పడిన వారిని పట్టుకునే క్రమంలో పోలీసులు ఈ రహస్య ఆసుపత్రుల గుట్టును రట్టు చేశారు. ఇటీవలే ఫిలిప్పీన్స్(Philippines) రాజధాని మనీలా శివార్లలో ఉన్న పాసే అనే పట్టణంలో పోలీసులు రైడ్లు చేశారు. అక్కడ ఆసుపత్రుల్లో ఉన్న డెంటల్ ఇన్‌ప్లాంట్స్, స్కిన్ వైటనింగ్ ఐవీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ టూల్స్ లాంటి వాటిని స్వాధీనం చేసుకున్నారు. వీటి సాయంతోనే డాక్టర్లు నేరస్థుల రూపు రేఖల్ని మార్చేస్తున్నారని ప్రకటించారు.
ఆసుపత్రుల్లో రహస్యంగా ఇలాంటి ప్లాస్టిక్ సర్జరీలు నిర్వహిస్తున్న ముగ్గురు డాక్టర్లను సైతం అరెస్టు చేశారు. ఈ డాక్టర్లలో ఇద్దరు వియత్నాంకి చెందిన వారు కాగా మరొకరు చైనాకు చెందిన డాక్టర్ అని చెప్పారు. అక్కడ మరో రెండు ఆసుపత్రులు సైతం ఇలాంటి అక్రమ సర్వీసుల్ని ఇస్తున్నాయని పోలీసులు తెలిపారు. చైనా మాఫియా ఆధ్వర్యంలో ఇలాంటి పనులు జరుగుతున్నాయన్న కోణంలో అక్కడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం బహిర్గతమైన ఈ విషయం మాత్రం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే రీతిలో ఉంది.