Sudan war: సూడాన్‌లో పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. దేశంపై నియంత్రణ సాధించడానికి సూడాన్ సైన్యం, పారామిలిటరీ బలగాల మధ్య రక్తపాత వివాదం ఆగడం లేదు. సూడాన్ సాధారణ ప్రజలు అంతర్యుద్ధంలో మండిపోతున్నారు. కాగా, ఆదివారం రాజధాని ఖార్టూమ్‌లో జరిగిన డ్రోన్ దాడి యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. కార్టూమ్‌లోని మార్కెట్‌పై జరిగిన వైమానిక దాడిలో కనీసం 40 మంది మరణించారు. దీనితో పాటు, డ్రోన్ దాడి కారణంగా 36 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు ఆరోగ్య కార్యకర్తలు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం బషీర్ యూనివర్సిటీ ఆస్పత్రికి తరలించారు. ఆదివారం నాటి డ్రోన్ దాడి వెనుక ఏ పార్టీ ఉందో ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే ఈ వైమానిక దాడి తర్వాత ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. ఏప్రిల్ 5న సూడాన్‌లో ప్రారంభమైన అంతర్యుద్ధం తర్వాత పౌరుల మరణాల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం.
సదరన్ ఖార్టూమ్ ఎమర్జెన్సీ రూమ్ అని పిలువబడే స్థానిక వాలంటీర్ల సమూహం ద్వారా షేర్ చేసిన ఫోటోలు అనేక మంది గాయపడినట్లు చూపించాయి. వైమానిక దాడులు జరిగిన ప్రాంతం స్పష్టంగా RSF నియంత్రణలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటన తర్వాత RSF ఒక ప్రకటనలో సూడాన్ సైన్యం దాడికి పాల్పడినట్లు ఆరోపించింది. అయితే, సూడాన్ సైన్యం బాధ్యతను తిరస్కరించింది.. RSF ని నిందించింది. బ్రిగేడియర్ జనరల్ నబిల్ అబ్దుల్లా రాయిటర్స్‌తో మాట్లాడుతూ వివిధ ప్రాంతాలలో శత్రు సమూహాలు, స్టేషన్లపై దాడి చేయడం మాత్రమే మా లక్ష్యమని పేర్కొంది. ఆగస్టు నాటి గణాంకాల ప్రకారం.. సైన్యం, RSF మధ్య జరిగిన ఘర్షణలో 4,000 మందికి పైగా మరణించారు. కొనసాగుతున్న ఘర్షణల మధ్య పెద్ద సంఖ్యలో ప్రజలు దేశం విడిచిపెట్టారు. హింసాకాండ కారణంగా దాదాపు 71 లక్షల మంది ఇళ్లను విడిచిపెట్టగా, 11 లక్షల మంది విదేశాల్లో తలదాచుకున్నారు.