బ్రిటన్ మహారాణి ఎలిజబెత్-2(96) కన్నుమూశారు. దాదాపు 70 సంవత్సరాల పాటు ఆమె బ్రిటన్ పాలించారు. కాగా… గురువారం ఆమె తన తుదిశ్వాస విడిచినట్లు బకింగ్ హామ్ ప్యాలెస్ ప్రకటించింది. కాగా… ఈ క్రమంలో ఆమె ఇన్నాళ్లు ధరించిన కిరీటంలోని కోహినూర్ వజ్రం ఆమె తర్వాత ఏవరికి చేరనుంది అనే విషయం ఆసక్తికరంగా మారింది.
రాణి మరణంతో ఆమె పెద్దకుమారుడు, వేల్స్ మాజీ యువరాజు ఛార్లెస్ నూతన రాజుగా, 14 కామన్వెల్త్ దేశాలకు దేశాధినేతగా వ్యవహరించనున్నారు. చార్లెస్ సతీమణి కెమిల్లా(డచెస్ ఆఫ్ కార్న్‌వాల్)కు రాణి హోదా దక్కుతుంది. అప్పుడు కోహినూర్‌తో పొదిగి ఉన్న ఎలిజబెత్ కిరీటం కెమిల్లాకు వెళ్లనుంది. ఎలిజబెత్-2.. 70 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది బ్రిటన్‌లో ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాతినుద్దేశించి రాణి ఇచ్చిన సందేశంలో తన కోడలు కెమిల్లానే తదుపరి రాణి కావాలని ఆకాంక్షించారు. తదుపరి రాణికే ఈ కిరీటధారణ జరగనుంది.
1937లో కింగ్ జార్జ్-6 పట్టాభిషేకం సమయంలో ఆయన సతీమణి కోసం రూపొందించిన ప్లాటినం కిరీటంలోనే ప్రస్తుతం కోహినూర్ ఉంది. ఇది ఇప్పుడు ఎలిజబెత్-2 నుంచి కెమిల్లాకు చేరుతుంది. ఈ కోహినూర్.. 105.6 క్యారెట్ల వజ్రం. దీనిని 14వ శతాబ్దంలో భారత్‌లో గుర్తించారు. తర్వాత ఎన్నో చేతులు మారింది.
1849లో బ్రిటిషర్లు పంజాబ్‌ను ఆక్రమించిన తర్వాత విక్టోరియా రాణి చెంతకు చేరింది. అప్పటినుంచి ఆ రాజ కుటుంబం కిరీటంలో వెలుగులీనుతోంది. అయితే భారత్‌తో సహా దాదాపు నాలుగు దేశాల్లో దీనిపై యాజమాన్య హక్కుకు సంబంధించిన వివాదం కొనసాగుతుండటం గమనార్హం.