భారతీయ టీ సిరీస్ యూట్యూబ్ ఛానల్‌ని రెండో స్థానానికి నెట్టి మిస్టర్ బీస్ట్ యూట్యూబ్ ఛానల్ మొదటి స్థానానికి ఎగబాకింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి. పదండి చదివేద్దాం.
MrBeast : ఇప్పటి వరకు అత్యధిక సబ్స్క్రైబర్లు కలిగిన నెంబర్ వన్ యూట్యూబ్ ఛానల్ గా భారత్‌కు చెందిన మ్యూజిక్ కంపెనీ ‘టీ సిరీస్’ (T-Series) ఉండేది. ఇప్పుడు దాన్ని వెనక్కి నెట్టి ప్రపంచ నెంబర్ వన్ యూట్యూబ్ ఛానల్‌గా మిస్టర్ బీస్ట్ అవతరించింది. ఇప్పుడు దీనికి 26.6 కోట్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. టీ సిరీస్‌కు దాని కంటే 1608 మంది సబ్స్క్రైబర్లు మాత్రమే తక్కువ ఉన్నారు.
సబ్స్క్రైబర్ల నెంబర్ల దృష్య్టా ఇప్పుడు ‘మిస్టర్ బీస్ట్’ (MrBeast) మొదటి ప్లేస్‌ని కొట్టేసింది. ఈ విషయాన్ని ఆ ఛానల్ నిర్వాహకుడు అమెరికాకు చెందిన జేమ్స్ స్టీఫెన్ డొనాల్డ్సన్ వెల్లడించారు. తన ఎక్స్ ఖాతా లో దీన్ని ట్వీట్ చేశారు. ఆయన పోస్ట్ కొద్ది వ్యవధిలోనే వైరల్‌గా మారింది. గంటల వ్యవధిలోనే దానికి 12 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చేశాయి.
ప్రపంచ బిలియనీర్ ఎలాన్ మస్క్ సైతం ఈ విషయమై స్పందించారు. మిస్టర్ బీస్ట్ ఛానల్‌ను అభినందించారు. యూట్యూబ్‌లో (YOUTUBE) 2024 ఏప్రిల్‌లో ఈ ఛానల్ 25 కోట్ల సబ్‌స్క్రైబర్ కౌంట్‌ని దాటేసింది. ఇప్పుడు అత్యంత వేగంగా వృద్ధి చెందుతూ టీ సిరీస్‌ని సైతం వెనక్కి నెట్టేసి ఫస్ట్ ప్లేస్‌ని కొట్టేసింది. 2019 నుంచి 2024 మే వరకు టీ సిరీస్ మొదటి స్థానాన్ని కొనసాగించింది. దాన్ని ఇప్పుడు మిస్టర్ బీస్ట్ బీట్ చేసింది. 2023లో యూట్యూబ్ ద్వారా ఎక్కువ డబ్బు సంపాదించిన ఛానల్గానూ నిలిచింది.