ఓ వ్యక్తి తన భార్య ముందే పాము కాటుతో ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. క్వీన్స్ లాండ్ కు చెందిన ఓ వ్యక్తి ఇంటి వెనుక ఉండగా.. ఓ పాము తన చేతి మీద కాటేసింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ సమయంలో తన భార్య కూడా అక్కడే ఉంది. అది ఈస్టర్న్ బ్రౌన్ స్నేక్ అని చెబుతున్నారు. తన భర్తను పాము కాటేయగానే.. భార్య గట్టిగా అరిచింది. హెల్ప్ అంటూ గట్టిగా అరిచింది. దీంతో స్థానికులు వెంటనే అంబులెన్స్ కు కాల్ చేశారు. వైద్యులు అక్కడికి చేరుకునే లోపే ఆ వ్యక్తి కన్నుమూశాడు. ఈ ఘటన బ్రిస్బేన్ నుంచి 50 కిమీ దూరంలో ఉన్న లాక్ యెర్ వాలీలో చోటు చేసుకుంది.
ఆ ప్రాంతం పాములకు నిలయం. ముఖ్యంగా అక్టోబర్ నుంచి ఏప్రిల్ నెల వరకు అక్కడ వాతావరణం వేడిగా, తేమగా ఉండటం వల్ల పాములు తమ ఆవాసాలను వదిలి బయటికి వస్తుంటాయి. అక్కడ ఇలాంటి పాములకే కాదు.. కొండ చిలువలు కూడా ఉంటాయని స్నేక్స్ క్యాచర్స్ తెలిపారు. గతంలో క్వీన్స్ లాండ్ లోని హెర్వే బేలో టాయిలెట్ లో 4 అడుగుల పాము కనిపించింది. దానికి సంబంధించిన వీడియో అప్పట్లో వైరల్ అయింది.