India On Pakistan At IPU Meeting : పాకిస్థాన్ తమ జమ్ము కశ్మీర్ సరిహద్దుల దగ్గర ఉగ్రవాద ఫ్యాక్టరీలను ఆపాలంటూ భారత్ హెచ్చరించింది. స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరిగిన ఇంటర్ పార్లమెంటరీ యూనియన్(ఐపీయూ) 148వ సమావేశంలో రాజ్య సభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్(harivansh narayan singh) మాట్లాడారు. పాకిస్థాన్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉగ్రవాదులకు కొమ్ముకాచిన చరిత్ర పాక్కు ఉందన్నారు.
భారత్(INDIA) ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అని అంతా దీన్ని ఆదర్శంగా తీసుకుంటున్నారని హరివంశ్ నారాయణ్ సింగ్ అన్నారు. పాక్ ఒకవైపు కశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్ర దాడులు చేస్తూనే మరో వైపు హక్కుల కోసం పోరాడుతున్నామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని దుయ్యబట్టారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం, సహాయం చేయడం లాంటి వాటిల్లో పాక్ పాత్ర ఎలా ఉందో ఐపీయూ(IPU) సభ్యులందరికీ తెలుసునన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నిషేధించిన ఉగ్రవాదులకు అత్యధికంగా ఆశ్రయం కల్పిస్తోంది పాక్ ఏనని తెలిపారు. ఎవరెన్ని ప్రచారాలు చేసినా జమ్ముకశ్మీర్ భారత్లో అంతర్భాగమేనని, వాస్తవాల్సి ఎవరూ మార్చలేరని వెల్లడించారు.
ఇటీవల సింగపూర్లో పర్యటించిన భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్(s jaishankar) సైతం ఈ విషయమై మాట్లాడారు. పాకిస్థాన్(PAKISTAN) ఒక పరిశ్రమలా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని అన్నారు. అయితే తమ దేశం ఇప్పుడు ఉగ్రవాదాన్ని ఏ మాత్రం ఉపేక్షించే స్థాయిలో లేదని అన్నారు. ప్రతి దేశమూ ఒక సుస్థిరమైన పొరుగు దేశాన్ని కోరుకుంటుందన్నారు. అదీ కాకపోతే గొడవలకు దిగకుండా ఉండే దేశమైనా ఉండాలని ఆశిస్తుందన్నారు. అయితే పాక్తో మంచి సంబంధాలు కొనసాగించేందుకు తాము ఉగ్రవాదాన్ని మాత్రం చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.