Unhealthiest Carbs : పీచు పదార్థాలతో కలిసి ఉన్న కార్బోహైడ్రేట్లతో పోలిస్తే శీతల పానీయాలు, బ్రెడ్లు తదితరాల నుంచి లభించే సరళ పిండి పదార్థాలతో మన శరీరం భిన్నంగా ప్రభావితం అవుతుంది. వీటి వల్ల వచ్చే కార్బ్స్ వల్ల మన రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి డయాబెటీస్ లాంటివి వచ్చే అవకాశాలుంటాయి. అందువల్ల కొన్ని రకాల ఆహార పదార్థాల ద్వారా వచ్చే పిండి పదార్థాల్ని తీసుకోకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
పిల్లలకు బ్రెడ్‌లో జామ్‌లు, జెల్లీలను పెట్టి చిరు తిండిలాగా ఇస్తుంటాం. వీటిలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఒక టేబుల్ స్పూనుకే దాదాపుగా 50 క్యాలరీలు లభిస్తాయి. అయితే ఇలాంటి వాటి వల్ల వచ్చే పిండి పదార్థాల వల్ల శరీరానికి చెడే కాని మంచిది కాదు. అలాగే మనం ఇంట్లో తయారు చేసుకునే పెరుగు మంచి ప్రోబయోటిక్ . దీని వల్ల శరీరానికి కావాల్సిన కాల్షియం అందుతుంది. కానీ మార్కెట్లో ఫ్లేవర్డ్ యోగర్ట్ దొరుకుతోంది. మామిడి, స్ట్రాబెరీ, బ్లూబెరీ… లాంటి రకరకాల ఫ్లేవర్లలో, తియ్యటి రుచితో లభ్యం అవుతుంది. దీనిలో పండ్ల రుచి కోసం కృత్రిమ యెసెన్సులు, తీపి కోసం ఎక్కువ మొత్తంలో పంచదారను కలుపుతారు. అలాగే ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు ప్రిజర్వేటివ్లనూ వాడతారు. దీని వల్ల శరీరానికి చెడే ఎక్కువ. ఒకవేళ మీరు ఫ్లేవర్డ్ పెరుగును తినడానికి ఇష్టపడుతున్నట్లయితే ఇంట్లోనే దాన్ని తయారు చేసుకునేందుకు ప్రయత్నించండి.
కేకులు, పేస్ట్రీలు, మఫిన్లు, డోనట్లు… లాంటి వాటిని అంతా ఎంతో ఇష్టంగా తినేస్తుంటారు. వీటిలో పీచు పదార్థం ఏమాత్రం ఉండదు. సరికదా వీటిలో ఎక్కువగా మైదా, పంచదార, కొవ్వులు ఉంటాయి. అందుకనే వీటిని అనారోగ్యకరమైన పిండిపదార్థాలకు(Unhealthiest Carbs) మూలాలుగా నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి అనారోగ్యకర కార్బ్స్ ఉన్న వాటికి మనం దూరంగా ఉండాలి.