»Fried Rice That Took Lives If You Are Doing This You Are In Danger
Fried Rice Syndrome: ప్రాణాలు తీస్తోన్న ‘ఫ్రైడ్ రైస్’..మీరు కూడా ఇలా చేస్తుంటే డేంజర్లో ఉన్నట్లే!
ఫ్రైడ్ రైస్, ఫాస్ట్ ఫుడ్స్ తినడం వల్ల చాలా మంది అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. నిల్వ చేసిన ఆహారాన్ని పదే పదే వేడి చేసి తీసుకోవడం వల్ల ప్రాణాలు పోయే అవకాశం ఉంది. అందుకు కారణమైన బ్యాక్టీరియా గురించి కచ్చితంగా కొన్ని విషయాలను అందరూ తెలుసుకోవాలి.
ఈమధ్యకాలంలో ఫాస్ట్ ఫుడ్స్ (Fast Foods)కు ఎక్కువ మంది అలవాటు పడ్డారు. అలాగే ఓసారి వండిన ఆహారాన్ని మళ్లీ మళ్లీ వేడి చేసి తినడం అలవాటు చేసుకున్నారు. దీనివల్ల ఆహారం కలుషితం (Food Contaminated) అయ్యి ఆరోగ్యానికి అత్యంత హాని కలిగిస్తుందన్న విషయాన్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అయితే ఇటువంటి ఆహారాలు తినడం వల్ల లేనిపోని రోగాలు కొని తెచ్చుకున్నట్లే అవుతుందని వైద్యులు హెచ్చరించినా చాలా మంది దానిని గాలికి వదిలేస్తున్నారు. అయితే గత నెలలో తిరుపతి రూరల్ కాలూరుకు చెందిన నరేంద్ర అనే యువకుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఎగ్ ప్రైడ్ రైస్ తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. రుయా ఆస్పత్రిలో నరేంద్ర చికిత్స పొందుతూ మరణించిన ఘటన తెలిసిందే. ఇలాంటి ఘటనలు చాలా చోట్ల చోటుచేసుకున్నాయి.
ఒకసారి వండిన ఆహారాన్ని ఫ్రైడ్ రైస్ (Fried Rice) చేసి, దానిని మళ్లీ వేడి చేసి తినడం వల్ల వ్యక్తి ప్రాణాలు వదిలాడు. ఆ వ్యక్తి మరణానికి ‘ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్’ (Fried Rice Syndrome) కారణమని తేలింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్ అంటే ఏంటని, దాని లక్షణాలు ఎలా ఉంటాయని చాలా మంది నెట్టింట వెతకడం మొదలు పెట్టారు. ఈ ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్ అనేది 2008లో తొలిసారి కనుగొన్నారు. 20 ఏళ్ల యువకుడు నూడుల్స్ ప్రిపేర్ చేసుకుని తిన్నాక మిగిలిన దాన్ని ఫ్రిజ్‌లో ఉంచాడు. అలా ఉంచిన 5 రోజుల తర్వాత మళ్లీ దానిని వేడి చేసి తిన్నాడు. దీంతో పాయిజన్ అయ్యి ఆఖరికి తన ప్రాణాలను కోల్పోయాడు.
ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్ (Fried Rice Syndrome) లక్షణాలివే:
ఈ ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్ గురించి అమెరికన్ జర్నల్ ఆఫ్ బయోమెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ ఓ నివేదిక విడుదల చేసింది. ఈ ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్ అనేది ఆహారం ద్వారా సంక్రమించే వ్యాధి అని, ఇది బాసిల్లస్ సెరియస్ అనే బ్యాక్టీరియ ద్వారా ఫుడ్ పాయిజన్ అవుతుందని తేలింది. ఈ బ్యాక్టీరియా కడుపులో విషాన్ని ఉత్పత్తి చేస్తుందని, అలా కలుషిత ఆహారాన్ని తింటే వాంతులు, డయేరియా, జీర్ణాశయ వ్యాధులు వస్తాయని గుర్తించారు. ఈ సిండ్రోమ్ అటాక్ అయినప్పుడు వికారం, కడుపు నొప్పి వంటివి కనిపిస్తాయి. అయితే ఇందులో మరణించడం అనేది అరుదుగా మాత్రమే జరుగుతుందని వివరించారు.
బ్యాక్టీరియా ఉత్పత్తికి కారణాలివే:
సాధారణంగా అన్ని రకాల ఆహారాల్లో బ్యాక్టీరియా అనేది ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అయితే సరైన పద్దతిలో నిల్వ చేయని కొన్ని రకాల ఆహారాల్లో ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్ (Fried Rice Syndrome) అనేది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. వండిన కూరగాయలు, మాంసం వంటి వాటిని ఎక్కువ కాలం నిల్వ ఉంచితే అందులో ట్యాక్సిన్లు ఉత్పత్తి అవుతాయి. ఫుడ్‌ను వేడి చేసి పదే పదే తినడం వల్ల ఇది ఎక్కువగా వ్యాపించి ప్రాణం పోవడానికి కారణమవుతుంది.