Foods to avoid feeding to a baby : చిన్న పిల్లలకు ఈ ఆహారాలు అస్సలు పెట్టొద్దు!
చిన్న పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఇల్లు ఆనందంగా ఉంటుంది. వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తినా ఇక ఆసుపత్రుల చుట్టూ తిరగడమే అన్నట్లుగా పరిస్థితి తయారవుతుంది. ఇలాంటి వయసులో వారికి అస్సలు పెట్టకూడని ఆహారాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే..
సాధారణంగా చాలా మంది చిన్న వయసు పిల్లల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. వారు బయటి పరిసరాలకు అలవాటు పడే కొద్దీ మెల్ల మెల్లగా వారిలో ఇమ్యునిటీ (immunity) పెరుగుతూ వస్తుంది. కాబట్టి వారు కాస్త పెద్దగా అయ్యే వరకు వారికి ఇచ్చే ఆహారాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని రకాల పదార్థాల్ని వారికి అసలు పెట్టకపోవడమే మంచిదని పీడియాట్రీషియన్లు చెబుతున్నారు. ఐదారేళ్ల లోపు పిల్లలకు అస్సలు ఇవ్వకూడని ఆహార పదార్థాలేంటో వివరిస్తున్నారు.
సాధారణంగా పిల్లలు కూల్డ్రింకులు, చాక్లెట్లపై ఎక్కువ ఇష్టం చూపుతుంటారు. కృత్రిమంగా ఎసెన్సులు కలిపి తయారు చేసే పళ్ల రసాలు, శీతల పానియాలు, ఫ్రూట్ కాక్టైల్ డ్రింకులు, స్పోర్ట్స్ డ్రింకులు, ఎనర్జీ డ్రింకులు (energy drinks) లాంటి వాటిని వేటినీ కూడా పిల్లలకు అందించొద్దు. టీ, కాఫీలు, హెర్బల్ టీలలాంటి వాటికీ వీరిని దూరంగా ఉంచాలి. ప్రోసెస్డ్ ఫుడ్స్‌కి వీరిని దూరంగా ఉంచాలి. ప్యాకెట్లలో ఆహార పదార్థాలు ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు వారు రసాయనాలతో నిండిన ప్రిజర్వేటివ్‌లను వాడతారు. అలాంటి వాటిని పిల్లలకు ఇవ్వడం వల్ల వారి ఆరోగ్యానికి హాని కలుగుతుంది.
పిల్లలకు వండే కూరలు, చిరు తిళ్లలో ఉప్పు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఉప్పు చల్లిన… పొటాటో చిప్స్, మాంసం, చేప లాంటివి వద్దు. పచ్చళ్ల లాంటివీ వీరికి పెట్టకూడదు. ఉప్పు అనేది పిల్లల కిడ్నీలపై దుష్రభావాన్ని చూపుతుంది. కేవలం పంచదారతో మాత్రమే తయారయ్యే చెక్లెట్లు, క్యాండీలు, జామ్‌లు, జెల్లీల్లాంటి వాటిని పిల్లలకు అస్సలు ఇవ్వకూడదు. కేకులు, కుకీలు, పైలు, డోనట్లు లాంటి బేకరీల్లో దొరికే ఆహార పదార్థాల్ని వీరి జోలికి రానీయొద్దు. ఇవి గుల్ల రావడానికి వేసే రసాయనాలు పిల్లల జీర్ణ శక్తిని తగ్గించి వేస్తాయి. అలాగే వీటిలో ఎక్కువగా ఉండే చక్కెర వల్ల శ్వాసకోస సంబంధమైన వ్యాధులు వస్తాయి. అలాగే కృత్రిమ స్వీట్నర్లతో తయారు చేసే పదార్థాలనూ వీరికి ఇవ్వవద్దు.