ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కోరుకుంటారు. రోగాలు వచ్చి అవస్థలు పడాలని, ఆస్పతుల చుట్టూ తిరగాలని ఎవరూ కోరుకోరు. కానీ ఈరోజుల్లో మనం తీసుకునే ఆహారం మనల్ని ఆస్పత్రుల చుట్టూ తిరిగేలా చేస్తోంది. మనకు తెలీకుండానే మనమంతా కల్తీ ఆహారాలు తీసుకుంటున్నాం. నిజానికి అధికారులు సరిగా తనిఖీలు చేస్తే ఈ కల్తీ బండారం త్వరగా బయటపడుతుంది. కానీ అది సరిగాలేకపోవడం వల్ల కల్తీ రాజ్యం ఏలుతోంది.
ఆహార నాణ్యత సూచీలో తెలంగాణకు దేశంలోని 17 పెద్ద రాష్ట్రాల్లో 15వ స్థానం దక్కింది. అంతే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పక్కర్లేదు. ఈ సూచీలో వంద కు తెలంగాణకు 34.5 శాతం మార్కులు మాత్రమే రావడం గమనార్హం. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఆహార నాణ్యతా ప్రమాణాలు కూడా 34 శాతమేఉన్నట్లు లెక్క.ఇక తొలి మూడు స్థానాల్లో తమిళనాడు(82 శాతం), గుజరాత్(77.5 శాతం) మహారాష్ట్ర(70శాతం) ఉన్నాయి. అంటే ఈ మూడు రాష్ట్రాల్లో కల్తీ కాస్త తక్కువగా ఉందని అర్థం.
ఈరోజుల్లో ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో బయటి ఆహారం తినేందుకు ప్రజలు ఎక్కువ ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. అందుకే బయటి ఆహారానికి గిరాకీ ఎక్కువగా ఉంది. గిరాకీ పెరగడంతో తయారీ దారులు శుభ్రత, నాణ్యత పై ఎక్కువ దృష్టి పెట్టడం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప, అధికారులు కల్తీ ఆహారాలపై తనిఖీలు చేయడం లేదు. నామ మాత్రంగా తనిఖీలు చేపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆహార తనిఖీ నాణ్యత అధికారులు 50 మంది ఉన్నారు.
వారిలో 26 మంది కేవలం గ్రేటర్ హైదరాబాద్ లో తనిఖీలు చేపడుతుండగా, మిగిలిన 24 మంది రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో పని చేస్తున్నారు. అయినప్పటికీ వారు తమ విధులను సక్రమంగా చేస్తున్నట్లు ఎక్కడా కనిపించడం లేదు. ఈ అంశం పై తెలంగాణ ప్రభుత్వం కాస్త సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అలా తీసుకుంటే తప్ప ఈ కల్తీ లోకం నుంచి మనల్ని మనం రక్షించుకోగలం.