రామ భక్తులకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ శుభవార్త తెలియజేశారు. వచ్చే ఏడాది జనవరి నాటికి అయోధ్య రామ మందిరం ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. కాగా… ఈలోపే.. ఆలయం మాత్రమే కాదు.. ఆలయంలోకి వెళ్లే మార్గాలు సైతం ఆకర్షణీయంగా మార్చాలని నిర్ణయం తీసుకుంది. రామజన్మ భూమిలోని రామాలయానికి వెళ్లే మూడు దారుల్లోని నివాస, వాణిజ్య భవనాలు ఏకరీతిగా ఉండేలా తీర్చిదిద్దబోతోంది. దీని కోసం 2023లో సుమారు రూ.32 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది.
రామ్ పథ్, రామజన్మభూమి పథ్, భక్తిపథ్ మార్గాల్లోని ఇతర దేవాలయాలను, శ్రీరాముడి దేవాలయాన్ని సందర్శించే భక్తులు, ఇతరులు సరికొత్త అనుభూతిని పొందేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మార్గాల్లోని వీథులన్నీ ఆకర్షణీయంగా కనిపించేలా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. అన్ని నివాస, వాణిజ్య, ప్రభుత్వ కార్యాలయాల భవనాలను రంగులు, మెటీరియల్స్, ఇతర విధాలుగా ఏకరీతిగా ఉండేలా తీర్చిదిద్దడం కోసం 2023లో సుమారు రూ.32 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది.
అయోధ్య పట్టణంలో వీథుల స్వభావాన్ని తెలియజేసేవిధంగా వీథి దీపాలను ఏర్పాటు చేయాలని, ప్రకాశవంతమైన నామఫలకాలు , దుకాణాల ముందు భాగాలు, ప్రహరీ గోడలు, కిటికీలు, స్తంభాలు, సింహద్వారాలు వంటివాటిని ప్రత్యేకంగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది.