ఓ మైనర్ బాలుడు…డ్రగ్స్ కి బానిసగా మారి తన కుటుంబం మొత్తాన్ని హత్య చేశాడు. కుటుంబంలోని నలుగురు సభ్యులను అతి దారుణంగా హత్య చేయడం గమనార్హం. ఈ సంఘటన త్రిపురలో చోటుచేసుకోగా…. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
త్రిపుర లోని దాలై జిల్లా కమలాపూర్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 17ఏళ్ల మైనర్ బాలుడు… శనివారం ఉదయం తన తల్లిని, పదేళ్ల చెల్లిని, తాతను హత్య చేశాడు. ఈ ఘటనలో అడ్డొచ్చిన.. ఇంటి పక్కనే ఉండే మరో వ్యక్తిని కూడా హత్య చేశాడు. అలా మొత్తం నలుగురిని హత్య చేశాడు.
ఆ తర్వాత వారి మృతదేహాల్ని ఇంట్లో ఉన్న బావిలో పడేశాడు. అనంతరం అక్కడ్నుంచి పారిపోయాడు. ఆ సమయంలో బాలుడి తండ్రి ఇంట్లో లేడు. బయటకు వెళ్లాడు. తర్వాత అతడు ఇంటికి వచ్చి చూసేసరికి ఇల్లంతా రక్తపు మరకలు కనిపించాయి. వాటిని అనుసరిస్తూ వెళ్లి చూడగా బావిలో తన కుటుంబ సభ్యుల మృతదేహాలు కనిపించాయి. వెంటనే విషయాన్ని గ్రామస్తులకు తెలియజేశాడు. తన కొడుకే హత్య చేసుంటాడని అనుమానించాడు. అతను వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. నిందితుడి కోసం గాలించి, అదుపులోకి తీసుకున్నారు. బావిలోంచి మృతదేహాల్ని వెలికితీసి, పోస్టుమార్టమ్ కోసం తరలించారు. కాగా.. నిందితుడు అతను ఎందుకు హత్య చేశాడు అనే విషయం తెలియరాలేదు. కాగా.. నిందితుడు మొదటి నుంచి నేర ప్రవృత్తి ఉంది అనే విషయం మాత్రం తెలిసింది.