KNR: ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరుతూ జేఏసీ పిలుపునిచ్చిన ‘ఛలో సచివాలయం’ కార్యక్రమానికి కరీంనగర్ రీజియన్ టీఎంయూ నాయకులు భారీగా తరలివెళ్లారు. టీజీఆర్టీసీని ప్రైవేటుపరం చేసే కుట్రలను ఆపాలని, కార్మికులందరినీ ప్రభుత్వంలో విలీనం చేయాలని వారు డిమాండ్ చేశారు.
వేసవిని దృష్టిలో పెట్టుకుని మున్సిపాలిటీ ప్రజలు ఎక్కడ కూడా తాగునీటి ఎద్దడి రాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఛైర్ పర్సన్ మాధవి రమేష్ అధికారులను ఆదేశించారు. వనపర్తి జిల్లాలోని 33వ వార్డులో నూతన బోరు మోటర్ బిగించి వార్డు వాసులకు భరోసా కల్పించారు. బోరు మోటర్ నుంచి అంతర్గత పైప్‌లైన్‌లో బిగించి ప్రతి ఇంటికి తాగునీరు అందేలా చూడాలన్నారు.
MDK: నార్సింగి మండలం వల్లూర్‌లో మాజీ ఎంపీపీ చిందం సబిత కుటుంబాన్ని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకురాలు, మాజీ ఎంపీపీ చిందం సబిత భర్త రవీందర్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మరణించారు. ఈ విషాద ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
JGL: పదవ తరగతి విద్యార్థులు తరగతులకు తప్పకుండా హాజరుకావాలని మండల విద్యాధికారి శ్రీపతి రాఘవులు అన్నారు. రాయికల్ మండలంలోని అల్లీపూర్ పాఠశాలలో మంగళవారం 10వ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు రాస్తున్న పరీక్ష కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులు పరీక్ష సమయంలో ఎలాంటి ఒత్తిడికి గురి కావద్దని, పరీక్షలకు హాజరయ్యేంత వరకు తరగతులకు తప్పకుండా హాజరు కావాలని సూచించారు.
MLG: ఎర్రమంజిలోని మిషన్ భగీరథ కార్యాలయంలో, గ్రామీణ మంచినీటి సరఫరా, వేసవి సన్నద్ధతపై మంత్రి సీతక్క రివ్యూ నిర్వహించారు. ప్రతి ఇంటికి తాగునీరు సరఫరా చేసే లక్ష్యంతో మిషన్ భగీరథ సిబ్బంది పని చేయాలని, కేంద్ర ప్రభుత్వం ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేలా నిధులు మంజూరు చేయాలని మంత్రి కోరారు.
SRD: సమగ్ర సస్యరక్షణ చేపడితే పంట అధిక దిగుబడులు సాధించవచ్చని ఖేడ్ ADA నూతన్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం సిర్గాపూర్ మండలం వాసర్ గ్రామంలోని రైతు వేదికలో రైతులకు సమావేశపరిచి పంటల సాగు పద్ధతులపై అవగాహన కల్పించారు. రబీ సీజన్ పంటలు పూర్తవగానే చేనులో వేసవి దుక్కులు దున్నడం అవసరమని సూచించారు. సకాలంలో సస్యరక్షణలు చేపడితే పంట భూమిలో కీటకాలు ఉండవన్నారు.
NZB: డివిజన్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన 24 మందిని పోలీసులు పట్టుకున్నారు. వారిని ఇవాళ జిల్లా మార్నింగ్ కోర్టులో సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. వారిలో 21మందికి రూ.2.10లక్షల జరిమానా విధిస్తూ తీర్పు నిచ్చింది. మరో ముగ్గురికి ఒక్కొక్కరికి వారంపాటు జైలు శిక్ష పడింది. అంతకుముందు వారికి సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చారు.
BHNG: బీబీనగర్ గూడూరు బాలికల గురుకుల పాఠశాలలో కనీస వసతులు లేక విద్యార్థినులు రోడ్డుపై బైఠాయించారు. నీళ్లచారు, పురుగుల అన్నం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. వీరికి మద్దతుగా BRS నాయకులు ధర్నాలో పాల్గొని, విద్యార్థుల ఆరోగ్యంతో ఆడుకోవద్దని డిమాండ్ చేశారు. మెరుగైన భోజనం, వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
GDWL: అన్యాయంగా పసిపాపను చంపిన హంతకులకు పోలీసులు కొమ్ముకాస్తున్నారు అని సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ. వెంకటస్వామి పేర్కొన్నారు. మంగళవారం గద్వాల పాత బస్టాండ్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. కుమ్మేర జాతరలో చిన్నారి మృతికి కారకులైన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు. విచారణను తప్పుదోవ పట్టిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.
NLG: దేవరకొండ ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ పరీక్ష తరగతి గదులలో విద్యార్థుల సమస్యలపై మంగళవారం ఆర్డీవో ఆఫీస్‌లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కో కన్వీనర్ యలమల గోపీచంద్ మాట్లాడుతూ.. రేపటి నుంచి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో పరీక్ష రాసే గదులలో విద్యుత్ లైట్లు, ఫ్యాన్స్ , మంచినీటి వసతి, మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.
మంచిర్యాల రైల్వే అండర్ బ్రిడ్జి రహదారిపై ప్రమాదకరంగా మారిన గుంతలను పూడ్చాలని 55వ డివిజన్ కార్పొరేటర్ గాండ్ల సత్తమ్మ కోరారు. మంగళవారం కార్పొరేషన్ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. రోడ్డుపై ఉన్న గుంతలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రమాదాల నివారణకు రోడ్డు మరమ్మతులు త్వరగా చేపట్టాలని ఆమె కోరారు.
HNK: రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సీపీఎం పార్టీ కాజీపేట మండల కమిటీ ఆధ్వర్యంలో కాజీపేట తహసీల్దార్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. సీపీఎం మండల కార్యదర్శి ఓరుగంటి సాంబయ్య మాట్లాడుతూ.. రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు, అయోధ్యపురం భూ-నిర్వాసితులకు, అప్రెంటిస్ చేసిన యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని అన్నారు.
BDK: మార్చి 1న లక్ష్మీదేవిపల్లి మండలం ఎదురుగడ్డలో వేడుకలు నిర్వహిస్తున్నట్లు జేఏసీ ఛైర్మన్ లక్ష్మణ నాయక్ తెలిపారు. కొత్తగూడెం సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజును గిరిజన లంబాడీ సంఘాల జేఏసీ నాయకులు కోరారు. మంగళవారం ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు.
RR: మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ల బఫర్ జోన్ వివాదంపై MLA ప్రకాష్ గౌడ్ స్పందిస్తూ, బిల్డర్ల తప్పిదాలకు కొనుగోలుదారులు బలికాకుండా ప్రభుత్వం పూర్తి రక్షణ కల్పిస్తుందని హామీ ఇచ్చారు. బఫర్ జోన్ పరిధిలోని ఫ్లాట్ యజమానులకు వేరే గెటెడ్ కమ్యూనిటీలో సమాన విస్తీర్ణమున్న ఫ్లాట్లను ఇవ్వడం లేదా ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం చేయిస్తాం అన్నారు.
ఆసిఫాబాద్ కలెక్టరేట్ భవనంలోని ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ హరిత అకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను పరిశీలించి సమయపాలనపై అధికారిని అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులు విధులకు సమయానికి హాజరవుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.