NGKL: నాగర్‌కర్నూల్ సమీపంలోని వనపట్ల గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఓ కారు బైక్‌ను ఢీకొట్టడంతో బైక్‌పై ఉన్న గన్నోజ్ సురేష్ చారి(40) అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్ నుంచి సోమశిలకు వెళ్తున్న కారు కారణంగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. భార్య రాణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
KNR: కేంద్రం అమలు చేస్తున్న వీబీజీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంను యథావిధిగా కొనసాగించాలని కరీంనగర్లో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్ల రాజు డిమాండ్ చేశారు. అలాగే ఉపాధి కూలీల వేతనాన్ని రూ.600కు పెంచాలని కోరారు. పనిస్థలాల్లో తాగునీరు, టెంట్లు వంటి సౌకర్యాలు కల్పించాలని, లేదంటే ఆందోళనలు చేపడతామని అన్నారు.
SRD: హైదరాబాద్‌లో జరుగుతున్న తెలంగాణ 4వ పోలీస్ స్పోర్ట్స్ మీట్ బాడ్మింటన్ సింగల్స్ విభాగంలో రేంజ్-1 నుంచి పాల్గొని నారాయణఖేడ్ బాడ్మింటన్ క్రీడాకారుడు అబ్దుల్ సాజిద్ బ్రాంజ్ మెడల్ సాధించాడు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐజీపీ గజరావ్ భూపాల్ బహుమతి ప్రదానం చేశారు. సాజిద్ విజయం పట్ల 4వ బేటాలియన్ కమాండెంట్ D.శివప్రసాద్ రెడ్డి, అధికారులు అభినందించారు.
KMM: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మార్చి 5న HYDలో జరగనున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు హాజరుకావాలని కోరుతూ వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి హాజరై ఆశీర్వచనాలు అందజేయాలని కోరారు.
WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలో నిర్వహించిన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో జిల్లా కలెక్టర్ డా. సత్య శారద పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సేవాలాల్ మహారాజ్ బోధనలు సమాజానికి మార్గదర్శకమని, గిరిజనుల ఆత్మగౌరవానికి ఆయన జీవితమే ప్రేరణగా నిలిచిందని పేర్కొన్నారు. గిరిజనుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.
GDWL: ధరూర్ మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఉపాధ్యాయుల సముదాయ సమావేశం జరిగింది. ఎంఈవో రవీంద్రబాబు మాట్లాడుతూ… ప్రతి పాఠశాలలో ఎఫ్ఎల్ఎస్ కార్యక్రమాన్ని తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థుల కనీస సామర్థ్యాల పెంపుపై దృష్టి పెట్టాలని.. మధ్యాహ్న భోజన పథకం వివరాలను ప్రతిరోజూ ఎస్ఎంఎస్ ద్వారా పంపించాలని సూచించారు.
NRPT: మైనార్టీ గురుకుల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల నిర్మాణాత్మక మూల్యాంకన (FA) మార్కుల పరిశీలన కొనసాగింది. ఉపాధ్యాయులు నరసింహారావు, లక్ష్మారెడ్డి, సంధ్య బృందం విద్యార్థుల అంతర్గత మార్కులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మార్చిలో జరగనున్న వార్షిక పరీక్షలకు విద్యార్థులు పక్కాగా సన్నద్ధం కావాలని ఈ సందర్భంగా వారు సూచించారు.
WNP: బీఆర్ఎస్ హయాంలో కేవలం పార్టీ కార్యకర్తలకే ఇళ్ల పట్టాలు ఇచ్చారని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి విమర్శించారు. కొత్తపల్లిలో లబ్ధిదారురాలు గొల్ల శంకరమ్మ ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుకలో పాల్గొని ఆయన నూతన వస్త్రాలు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల ఇళ్లు కడితే కమిషన్లు రావనే ఉద్దేశంతో గత ప్రభుత్వం వాటిని పెట్టిందని ఆరోపించారు.
KMR: జుక్కల్ మండలం సావర్గవ్ గ్రామంలో తాగునీటి ఎద్దడి నివారణకు శుక్రవారం సర్పంచ్ రవి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. బోరుబావుల మరమ్మతులు చేపట్టాలని, పైపులైన్ల లీకేజీలను అరికట్టి నీటి వృథాను అరికట్టాలని నిర్ణయించారు. తాగునీటి సరఫరాకు ఆటంకం కలగకుండా మోటార్లకు మరమ్మతులు చేయించాలని తీర్మానించారు. అలాగే దళితవాడలో మురుగుకాలువల నిర్మాణానికి నిధులు ఇవ్వాలన్నారు.
MHBD: తొర్రూరు మండలంలోని హరిపిరాల గ్రామంలో ఇవాళ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ. యాకుబ్ ఉపాధి హామీ కూలీల దగ్గరకు వెళ్లి, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. జీరాంజీ చట్టాన్ని రద్దుచేసి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కూలీలకు కనీస వేతనం రూ. 600 పెంచాలని కోరారు.
BDK: ఐటీడీఏ పీవో రాహుల్‌ను, జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కాశీ హుస్సేన్ ఆధ్వర్యంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల యూపీలో జరిగిన ఫెడరేషన్ కప్ రెస్లింగ్ పోటీల్లో వెంకటప్రసాద్ 97 కేజీల విభాగంలో నవీన్ 100 కేజీల విభాగంలో సత్తా చాటారు. బెస్ట్ ర్యాంకుల్లో నిలిచి ఖేలో ఇండియా జాతీయ ఛాంపియన్ షిప్ పోటీలకు ఎంపికయ్యారు.
NGKL: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని ఊర్కొండ సర్పంచుల సంఘం అధ్యక్షుడు రమేష్ నాయక్ అన్నారు. గుండ్లగుంటపల్లి అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. నాణ్యమైన ఆహారం ద్వారా మాతాశిశు మరణాలను అరికట్టడమే ధ్యేయమని తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ రజని, ఉపసర్పంచ్ కొండల్ పాల్గొన్నారు.
HYD: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన సెక్రటేరియట్లో జరిగిన సమీక్షలోని నిర్ణయాలపై కంటోన్మెంట్ MLA శ్రీగణేశ్ అధికారులతో సమావేశమయ్యారు. నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అనువైన స్థలాలను గుర్తించి అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
KNR: మున్సిపల్ ఎన్నికల్లో గెలిస్తే ఆడపిల్లల వివాహానికి రూ. 10,116 ఇస్తానని హుజరాబాద్ 21వ వార్డు కౌన్సిలర్ పంజాల రాజ్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు. ఎన్నికలో ఆయన గెలవడంతో ఇచ్చిన హామీ మేరకు వార్డుకి చెందిన పోగు తేజస్వినికి వివాహం నిశ్చయం కాగా ఇవాళ నగదును అందజేశారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రజలందరూ వార్డు కౌన్సిలర్ పంజాల మనోజ్‌ను అభినందించారు .
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం, ఏన్కూర్ మండలం హిమామ్ నగర్ గ్రామంలోని ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో వైరా నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మాలోత్ రాందాస్ నాయక్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని, సేవాలాల్ మహారాజ్ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.