Ratan Tata: ప్రముఖ వ్యాపారవేత్తలకు బెదిరింపులు వస్తున్నాయి. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి గతంలో బెదిరింపు మెయిల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. మరోసారి ఇలాంటి బెదిరింపులు ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటాకు వచ్చాయి. ఇటీవల ముంబాయి పోలీసు కంట్రోల్ రూమ్‌కు గుర్తు తెలియని ఓ వ్యక్తి కాల్ చేసి.. రతన్ టాటా ప్రాణానికి ముప్పు ఉందని హెచ్చరించినట్లు పోలీసులు తెలిపారు. రతన్ టాటా భద్రతను పెంచాలని.. లేకపోతే ఆయనకు కూడా సైరస్ మిస్త్రీలాగే అవుతుందని హెచ్చరించినట్లు సమాచారం.
పోలీసులు వెంటనే అప్రమత్తమై.. రతన్ టాటా భద్రతను పెంచారు. తనిఖీలు కూడా చేపట్టారు. వీటితో పాటు గుర్తు తెలియని వ్యక్తి నుంచి వచ్చిన ఫోన్ కాల్ గురించి కూడా దర్యాప్తు చేపట్టారు. ఈ కాల్ కర్ణాటక నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే అతన్ని అరెస్ట్ చేశారు. కాల్ చేసి బెదిరించిన నిందితుడు పూణేకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కొన్ని రోజుల కిందట నిందితుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం అతను మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంకా ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.