vidudala part 1: విడుదల పార్ట్ 1 మూవీ తెలుగు రివ్యూ
జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ తమిళ్ దర్శకుడు వెట్రిమారన్ విడుతలై పార్ట్ 1 పేరుతో కొత్త చిత్రంతో తిరిగి వచ్చాడు. గత నెలలో విడుదలైన ఈ తమిళ చిత్రం ఇప్పుడు తెలుగులోకి డబ్ చేయబడి ఈరోజు(ఏప్రిల్ 15న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.
ఆడుకాలం, విసరనై, అసురన్ చిత్రాలకు జాతీయ అవార్డులను గెలుచుకున్న ప్రముఖ తమిళ్ దర్శకుడు వెట్రిమారన్(vetri maaran)తెరకెక్కించిన తాజా చిత్రం విడుదల పార్ట్ 1(vidudala part 1 ) ఈరోజు తెలుగులో థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ చిత్రం మార్చి 31న తమిళంలో విడుతలై పార్ట్ 1 పేరుతో రిలీజ్ అయ్యింది. దీంతోపాటు ఈ చిత్రం మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో తెలుగులో విడుదల చేసేందుకు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ముందుకొచ్చారు. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించగా..తమిళ హాస్యనటుడు సూరి హీరోగా నటించారు. దీంతోపాటు విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్ కూడా ప్రధాన పాత్రల్లో యాక్ట్ చేశారు. మరోవైపు ఈ మూవీకి ఇళయరాజా సంగీతం అందించారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కథ
విడుదల కథ అంతా మానవీయ విలువలు, మనస్సాక్షి, పోలీసుల క్రూరత్వం, అన్యాయం వంటి అంశాలపై కొనసాగుతుంది. నిరుపేద గ్రామస్తులను కాపాడుతూ తన ఆదేశాలను ధిక్కరించినందుకు, ఓ కంపెనీకి చెందిన అధికారి ఇన్ఛార్జ్ రాగవేందర్ (చేతన్) అనారోగ్యం కారణంగా కానిస్టేబుల్ కుమరేశన్ (సూరి) కొత్త రిక్రూట్ అవుతాడు. ఆ క్రమంలో భయంకరమైన నక్సలైట్ పెరుమాళ్ “మాస్టర్” (విజయ్ సేతుపతి)ని పట్టుకోవడానికి.. పబ్లిక్ వర్క్స్ మంత్రి ఎ.సుబ్రమణియన్ (రాజీవ్ మీనన్), ముఖ్య కార్యదర్శి ఇళవరసు (ఇళవరసు)తో కూడిన ప్రభుత్వ ఉన్నతాధికారులకు సహాయం చేయడమే కమరేషన్ పని. ఆ క్రమంలో కమరేషన్ ఎదుర్కొన్న పరిస్థితులు ఎంటి? పెరుమాళ్ అరచకాలను సూరీ ఎలా ఎదుర్కొన్నాడు? సునీల్ మీనన్ (గౌతమ్ మీనన్) నేతృత్వంలోని ఆపరేషన్ ఘోస్ట్ హంట్ ఎక్కడికి దారి తీసింది? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే
వెట్రిమారన్ బాంబు పేలుళ్లతో ఘాటుగా కథనాన్ని ప్రారంభించి, ఆపై వివిధ పాత్రల వివరాలలోకి వెళ్తాడు. ఇది సినీ ప్రేమికులలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ప్రభుత్వ పక్షాన్ని, ఎన్కౌంటర్ల తీరును ఆయన హైలైట్ చేశారు. సూరి క్యారెక్టర్ ఆర్క్ చాలా అందంగా ఉంది. వారి చుట్టూ తిరిగే వ్యక్తులను ప్రభావవంతంగా చూపించారు. పోలీసులలో మంచోళ్ళు, చెడ్డోళ్లు ఉంటారని వెట్రిమారన్ చెప్పకనే చెప్పారు. దీంతోపాటు 1980లో నాటి స్టోరీని సహజంగా చిత్రాన్ని తెరకెక్కించే క్రమంలో ఇంతకు ముందు కంటే ఓ అడుగు ముందుకు వెళ్లిన ఫీలింగ్ కలుగుతుంది. మహిళలు, పురుషులు అనే వ్యత్యాసం లేకుండా దుస్తులు విప్పించిన సన్నివేశాలు వచ్చినప్పుడు ఒళ్ళు జలదరిస్తుందని చెప్పవచ్చు. ఆ స్థాయి సీన్లను తెలుగు ప్రేక్షకులు చూడలేరేమో అనిపిస్తుంది. సినిమా ప్రారంభంలో ట్రైన్ యాక్సిడెంట్ సన్నివేశాల్లోనూ గాయాలు పాలైన వ్యక్తులను చూసినప్పుడు మనకు తెలియకుండా ఒక విధమైన ఫీలింగ్ కలుగుతుంది. దీంతోపాటు కథలో స్వచ్ఛత, సింప్లిసిటీ ఆకట్టుకుంటుంది.
విడుదల పార్ట్ 1′ చూశాక…పార్ట్ 2 కోసం అసలు కథను వెట్రిమారన్ దాచేశారని అనిపిస్తుంది. పెద్ద నెట్వర్క్ కలిగిన ప్రజాదళం నాయకుడు అంత సులభంగా అరెస్ట్ కావడం వెనుక ఏమైనా ప్లాన్ ఉందా? అనే సందేహం కలుగుతుంది. ట్రైన్ బ్లాస్ట్ గురించి పతాక సన్నివేశాల్లో విజయ్ సేతుపతి పదేపదే చెప్పడం వెనుక కూడా పార్ట్ 2లో ఏదో చూపించబోతున్నారని అర్థం అవుతుంది. ప్రధానంగా పత్రికల్లో వార్తల్లో వెనుక మరో కోణం ఉంటుందని, నిజాల్ని దాస్తారని సున్నితమైన విమర్శ చేశారు. మరోవైపు ప్రతిదీ గుడ్డిగా నమ్మకూడదనే సందేశమూ కూడా ఇచ్చారు.
ఎవరెలా చేశారు
కామెడీ పాత్రలకు పేరుగాంచిన సూరి కానిస్టేబుల్ పాత్రలో అద్భుతంగా యాక్ట్ చేశాడు. వాస్తవానికి, అతను పాత్రలో జీవించాడని చెప్పవచ్చు. దీంతోపాటు అతని వ్యక్తీకరణలు, భావోద్వేగాలు, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ కూడా బాగుంది. వీక్షకులు వెంటనే అతని పాత్రకు కనెక్ట్ అవుతారు. మరోవైపు మహిళా కథానాయిక భవానీ శ్రీకి పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్ర వచ్చింది. ఆమె మంచి భావోద్వేగాలను ప్రదర్శించింది. ఇక విజయ్ సేతుపతి యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్లైమాక్స్ సీన్స్ సహా పలు చోట్ల ఆసక్తి కలిగించే విధంగా నటించాడు. దీంతోపాటు రాజీవ్ మీనన్, గౌతమ్ మీనన్ సహా పలువురు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.