ప్రజాగాయకుడు గద్దర్ (Gaddar) అంతిమయాత్రలో విషాద ఘటన చోటుచేసుకుంది. గద్దర్ కడసారి చూపుకోసం అభిమానులు భారీగా తరలిరావడంతో తొక్కిసలాటలో ప్రముఖ ఉర్దూ పత్రిక సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ (Zaheeruddin Ali Khan) గుండెపోటుతో మరణించారు. జహీరుద్దీన్ … గద్దర్ కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. గద్దర్ భౌతికకాయం ఎల్బీ స్టేడియం నుంచి ఇంటికి తీసుకువచ్చే క్రమంలో ఆయన వాహనం వెంటే ఉన్నారు. కాగా, గద్దర్ అంతిమయాత్రకు భారీగా ప్రజలు తరలి రాగా, అంతిమయాత్ర ప్రారంభమైన సమయంలో తోపులాట జరిగింది. దాంతో, ఆయన ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరయ్యారు.
తీవ్ర అస్వస్థతకు గురై కిందపడిపోయిన ఆయనను ఇతరులు ఆసుపత్రికి తరలించారు. ఆయన మరణించినట్టు డాక్టర్లు వెల్లడించారు. గుండెపోటుకు గురై ఉంటాడని భావిస్తున్నారు.ఎల్బీ నగర్ (LB Nagar) వరకు అంతిమయాత్రలో అలీఖాన్ పాల్గొన్నారు. అనంతరం ఆయన సృహ కోల్పోయినట్లు తెలుస్తోంది. ఆసుపత్రికి తరలించిన తర్వాత డాక్టర్లు హార్ట్ స్ట్రోక్ (Heart stroke) తో చనిపోయారని ధ్రువీకరించారు. అలాగే, మరొకరికి ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. అంతిమ యాత్ర హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం నుంచి గన్ పార్క్ వరకు ఆ తర్వాత అంబేద్కర్ విగ్రహం, ట్యాంక్ బండ్ మీదుగా అల్వాల్ (Alwal) వరకు కొనసాగింది. అల్వాల్‌లోని భూదేవినగర్ మహాబోధి స్కూల్ ఆవరణలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు జరిగాయి. బౌద్ధమత సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలను నిర్వహించారు