»There Is No Security For Our Jobs In The India 47 Percent People Revealed Adp Survey Said
No job security: దేశంలో మా ఉద్యోగాలకు భద్రత లేదు..47 శాతం మంది వెల్లడి
ఇండియాలో 47 శాతం మంది ఉద్యోగులు(employees) తమ ఉద్యోగాల పట్ల భద్రత లేదని వెల్లడించారు. అయితే సర్వే చేయబడిన 17 దేశాలలో సగటు 38 శాతం కంటే ఇది ఇండియా(india)లోనే ఎక్కువ ఉండటం విశేషం.
దేశంలో 47 శాతం మంది ఉద్యోగులు(employees) తమ స్థానాల్లో సురక్షితంగా లేరని ఓ సర్వే పేర్కొంది. సర్వే నిర్వహించిన 17 దేశాలలో సగటు 38 శాతం కంటే ఎక్కువ సంఖ్య ఇండియాలో ఉన్నట్లు తెలిపింది. జూలై 7న ఆల్వేస్ డిజైనింగ్ ఫర్ పీపుల్ (ADP) విడుదల చేసిన సర్వే నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. ఈ క్రమంలో యువత ఎక్కువగా ఉద్యోగ అనిశ్చితిని అనుభవిస్తున్నారని చెప్పింది. ‘పీపుల్ ఎట్ వర్క్ 2023: ఎ గ్లోబల్ వర్క్‌ఫోర్స్ వ్యూ’లో పేర్కొన్న రిపోర్టులో సర్వే చేయబడిన 32,000 కంటే ఎక్కువ మంది కార్మికులలో దాదాపు 50 శాతం (18 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు) సురక్షితంగా లేరని తెలిపింది.
ఈ సంఖ్య 55 ఏళ్లు పైబడిన వారి నిష్పత్తి కంటే రెట్టింపు కంటే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. 24 శాతం మంది వారు తమ కార్యాలయంలో అభద్రతగా ఫీలవుతున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో యువ ప్రతిభను నిలుపుకోవడానికి భారతీయ సంస్థలు తమ ఉద్యోగుల పట్ల ప్రత్యేక చొరవ చర్యలు తీసుకోవాలని సూచించింది. సాంకేతికత, వృత్తిపరమైన సేవల సంస్థలతో సహా వివిధ పరిశ్రమలలో ఉద్యోగ తొలగింపులతోపాటు కోవిడ్ మహమ్మారితో తీవ్రంగా దెబ్బతిన్న పరిశ్రమలలో కొనసాగుతున్న సమస్యల కారణంగా ఈ ఫలితాలు వచ్చినట్లు భావించింది.
లేఆఫ్ ట్రాకింగ్ వెబ్సైట్ Layoffs.fyi డేటా ప్రకారం, జనవరి 2023 వరకు 60కి పైగా భారతీయ సంస్థలు 10,000 మంది ఉద్యోగులను తొలగించాయి. దీంతోపాటు అదనంగా రాబోయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాధనాలు, ఆటోమేషన్ టెక్నాలజీలు మరింత ప్రమాదంలో పడేస్తాయని, పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తాయని గుర్తు చేసింది. ప్రత్యేకించి ప్రముఖ కార్పొరేషన్ సంస్థల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోయినట్లు ఇటీవలి నివేదిక తెలిపింది. మానవ ఉపాధికి AI ముప్పు అని ఆరోపించింది. అయితే భారతదేశ రియల్ ఎస్టేట్ రంగంలో ఉద్యోగులు (సుమారు 56 శాతం), నిర్మాణ పరిశ్రమ (సుమారు 55 శాతం) అత్యధిక స్థాయిలో ఉద్యోగ అభద్రతను కలిగి ఉన్నట్లు వెల్లడించింది. దీంతోపాటు మీడియా, సమాచార పరిశ్రమలలోని 54 శాతం మంది కార్మికులు ఇదే భావాన్ని కల్గి ఉన్నట్లు చెప్పింది.